|
తనను ఎంపిక చేయలేదన్న కారణంతో
తనను ఎంపిక చేయలేదన్న కారణంగా మాజీ ఫాస్ట్ బౌలర్, ఢిల్లీ క్రికెట్ సెలక్టర్ అమిత్ భండారిపై యువ ఆటగాడు దాడి చేయించడం దారుణమని డాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఘటనకు కారణమైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటాయని సెహ్వాగ్ తన ట్విట్టర్లో అభిప్రాయపడ్డాడు.
|
శిఖర్ ధావన్ తన ట్విట్టర్లో ఇలా
అమిత్ భండారి భయ్యాపై దాడి జరిగిందంటే తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. దాడి ఘటనపై వెంటనే విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్లు మదన్‌లాల్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ తదితరులు సైతం దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరిగింది?
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో యువ క్రికెటర్ల ఆటని పరిశీలించేందుకు వెళ్లిన భండారిపై జట్టులోకి ఎంపికవని ఓ యువ క్రికెటర్ తన స్నేహితులతో కలిసి హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి తెగబడ్డారు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టారు.

సుఖ్విందర్ సింగ్ ఆస్పత్రిలో
తల, చెవులకు గాయాలైన భండారిని సహచర సెలక్టర్ సుఖ్విందర్ సింగ్ ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు. దాడి సమయంలో అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు అల్లరి మూకను అడ్డుకునేందుకు ముందుకొచ్చారు. ఎవరూ కలుగజేసుకోవద్దంటూ నిందితులు తుపాకీ చూపించి బెదిరించారు.

నిబంధనలకు అనుగుణంగానే
అండర్-23 జట్టులో స్థానం ఆశించి భంగపడ్డ అనూజ్ ఆహుజా అనే ఆటగాడు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. అనూజ్ విషయంలో భండారి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవంబరులో 79 మందితో డీడీసీఏ విడుదల చేసిన అండర్-23 ప్రాథమిక జాబితాలో అతడి పేరున్నా, ప్రదర్శన బాగోలేకపోవడంతో పక్కన పెట్టారు.

40 ఏళ్ల అమిత్ భండారి టీమిండియాకు రెండు వన్డేల్లో
అనూజ్ 1995 నవంబరు 22న జన్మించడంతో ఎంపికకు అర్హుడు కాలేకపోయాడు. 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000-2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.