టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పినప్పటికీ, ఐపీఎల్ లో కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. అయితే అతడు ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కలిసి తిరుగుతోన్న ఫొటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచులకు కలిసి హాజరవుతున్నారు కూడా.
అవును రిలేషన్‌షిప్‌లో ఉన్నా...
తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న గబ్బర్.. తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాడు. 'అవును నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ప్రేమించడంలో నేను దురదృష్టవంతుడిని మాత్రం కాదు. ఇంతకుముందు సరైన అనుభవం లేక సరైన వ్యక్తిని ఎంచుకోలేదు. ఇప్పుడు నాకు అనుభవం ఉంది. అదే గొప్ప ప్రేమను నాకు అందిస్తుంది. ప్రేమలో మంచి, చెడు.. రెండూ సందర్భాలు ఉంటాయి.' అని చెప్పుకొచ్చాడు.

ప్రేమలోనే ఉంటా...
మళ్లీ ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నారా? అని మరొకరు ప్రశ్న సంధించగా ధావన్ మరో ఆసక్తికర సమాధానమిచ్చాడు.'నేను ఎప్పుడూ ప్రేమలో ఉంటాను! క్రికెట్‌లో బౌన్సర్ల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు. అలానే మీరు ఇప్పుడు నా మీదకి ఒక బౌన్సర్ ను విసురుతున్నారు. కానీ, నేను దాన్ని నుంచి తప్పించుకుంటానుగా. నేను అస్సలు దొరకను' అని ధావన్ నవ్వుతూ బదులిచ్చాడు.
మీరు ప్రేమించిన అమ్మాయి మంచిదేనా? అని అడగగా.. 'తెలివైనవారికి ఒక హింట్ సరిపోతుంది.' అని సమాధానమిచ్చాడు. ఆ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించగా.. 'ఈ రూమ్ లో ఉన్న మోస్ట్ బ్యూటీఫుల్ గర్ల్ నా ప్రియురాలు' అని సమాధానమిచ్చాడు.
పెళ్లిపై ఎప్పుడు చేసుకుంటారు? అని మరో ప్రశ్న సంధించగా.. 'నాకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. తొందరేముంది. ఇప్పుడేతే ప్లాన్స్ ఏమీ లేవు' అని ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు.