Shikhar Dhawan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిఖర్ ధావన్ ఒక 'మిస్టరీ గర్ల్'తో స్టాండ్స్ లో కూర్చుని కనిపించాడు. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి చూపారు. అయితే శిఖర్ ధావన్ ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కలిసి తిరుగుతోన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా శిఖర్ ధావన్ తాను రిలేషన్ షిప్‌లో ఉన్నానని అధికారికంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది.
శిఖర్ ధావన్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడా?
శిఖర్ ధావన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని.. అతడి మాటలను బట్టే తెలుస్తోంది. నిజానికి 39 ఏళ్ల శిఖర్ ధావన్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యాంకర్ శిఖర్ ధావన్‌ను తన స్నేహితురాలి గురించి అడిగారు. దానికి శిఖర్ ధావన్ మొదట్లో సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత మాట్లాడుతూ.. 'నేను ఎవరి పేరు చెప్పను కానీ.. నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమే" అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాత వీడియోలు మళ్లీ వైరల్ గా మారాయి. ఆ అందమైన అమ్మాయి ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ అంటూ కథనాలు వచ్చాయి. పేరు చెప్పకుండా శిఖర్ ధావన్.. ఆమే తన ప్రియురాలు అని పరోక్షంగా ధ్రువీకరించాడని కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. "నేను నా కొడుకును చూసి రెండు సంవత్సరాలు అయింది. చివరిగా అతనితో మాట్లాడి ఒక సంవత్సరం అయింది. ఇది కష్టంగా ఉంది. నేను నా కొడుకును చాలా మిస్ అవుతున్నాను." అని అన్నాడు. శిఖర్ ధావన్ 2023 అక్టోబర్ లో ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన కొడుకు సంరక్షణను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ తన బిడ్డను సంప్రదించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్
గత ఏడాది ఆగస్టు 24న శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. శిఖర్ ధావన్ తన కెరీర్ లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. శిఖర్ ధావన్ టెస్టుల్లో 2315 పరుగులు, వన్డేలు 6793 పరుగులు, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు.