షెహజాద్ నుంచి వార్న్ వరకు: డోపింగ్ టెస్టులో దొరికిన క్రికెటర్లు వీళ్లే


హైదరాబాద్: డోపింగ్... స్పాట్ ఫిక్సింగ్ తరువాత క్రికెట్‌ను పట్టిపీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన అంశం. తాజాగా పాకిస్థాన్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెహజాద్ డోప్ పరీక్షలో దోషీగా తేలాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో క్రికెటర్లు డోపింగ్ పరీక్షలో విఫలం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు క్రికెటర్లు డోప్ పరీక్షల్లో నిందితులుగా తేలి నిషేధానికి గురయ్యారు. అందులో అగ్రస్థానంలో ఉన్నది మాత్రం పాకిస్థాన్ ఆటగాళ్లే. డోపింగ్‌పై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఐసీసీ సస్పెన్షన్ వేటు వేస్తున్నా దీనిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.
డోప్ టెస్టుల్లో విఫలమైన స్టార్ క్రికెటర్లు వీరే..:

యూసుఫ్ పఠాన్ - భారత్
భారత ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ 2017లో ఓ దేశవాళీ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. అతడు నిషేధిత టెర్బుటలైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు డోప్ పరీక్షలో తేలింది. యూసఫ్ పఠాన్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల పాటు అతడిపై నిషేధం విధించింది. భారత క్రికెట్ చరిత్రలో డోప్ పరీక్షలో దొరికిపోయిన రెండో క్రికెటర్‌గా పఠాన్ నిలిచాడు.

మహమ్మద్ షెహజాద్ - అఫ్గనిస్థాన్
డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో ఆప్ఘనిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ షెహజాద్‌పై 12 నెలల నిషేధం విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. బరువు తగ్గేందుకు వాడా నిషేధిత పదార్థాల జాబితాలో ఉన్న క్లెన్‌బుటెరోల్‌ను అతడు తీసుకోవడమే నిషేధానికి కారణం.

ఆండ్రీ రస్సెల్ - వెస్టిండీస్
వెస్టిండీస్ జట్టుకు రెండు వరల్డ్‌కప్ టీ20 టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ డోప్ ఫరీక్షలో విఫలం కావడంతో ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతడిపై జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ చర్యలు తీసుకుంది.

యాసిర్ షా - పాకిస్థాన్
పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడు నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. 2015లో షా మూత్ర నమూనాల్లో నిషేధిత పదార్థాలను గుర్తించారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడిపై నిషేధం విధించింది.

ప్రదీప్ సంగ్వాన్ - భారత్
2012 ఐపీఎల్ సీజన్‌లో నిర్వహించిన డోప్ పరీక్షలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ దోషిగా తేలి 18 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. డోపీగా తేలిన తొలి భారత క్రికెటర్ ఇతనే కావడం విశేషం.

ఉపుల్ తరంగ - శ్రీలంక
శ్రీలంక క్రికెట్లో డోపీగా తేలిన తొలి క్రికెటర్ ఉపుల్ తరంగ. ఆస్తమా సమస్యకు సంబంధించిన మందులను తీసుకోవడంతో 2011 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ అనంతరం నిర్వహించిన డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు.

మహ్మద్ ఆసీఫ్ - పాకిస్థాన్
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా డోపీగా తేలాడు. దీంతో అతడిపై ఏడాది పాటు నిషేధం విధించారు.

షోయబ్ అక్తర్ - పాకిస్థాన్
రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. అక్తర్‌తో పాటు మహ్మద్ ఆసీఫ్ కూడా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

షేన్ వార్న్ - ఆస్ట్రేలియా
2003లో ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా డోప్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 వరల్డ్‌కప్ సమయంలో డోపీగా దొరికాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications