

హైదరాబాద్: గాయం నుంచి కోలుకున్న తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు యువ క్రికెటర్ పృథ్వీ షా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలోకి దిగిన పృథ్వీ షా(47 బంతుల్లో 71) హాఫ్ సెంచరీ సాధించి సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రౌండ్ 4లో భాగంగా సోమవారం గోవా-ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 47 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 71 పరుగులు చేయడంతో గోవాపై ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గోవా నిర్దేశించిన 141 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలుండగానే ముంబై చేధించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గోవా ఫాస్ట్ బౌలర్ వేసిన లెంత్ డెలివరీని పృథ్వీ షా ఒంటి చేత్తో బాదిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు కెప్టెన్ రహానే(31)తో కలిసి పృథ్వీ షా తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గోవా ఓపెనర్లు షగున్ కామత్(27), అమోగ్ దేశాయ్(38) చక్కటి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి, శార్దూల్ ఠాకూర్, శుభమ్ రజనీ, శామ్స్ మౌలాని తలో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు:
Goa 140/4 (Amogh Desai 38, Sagun Kamat 27; Shubham Ranjane 1-19) lost to Mumbai 141/4 (Prithvi Shaw 71, Ajinkya Rahane 31; Vijesh Prabhudesai 1-11) by six wickets.