హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ ఆసాంతం ధరించిన జెర్సీ నెంబర్ 10ని ధరించి అప్పట్లో వార్తల్లో నిలిచిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ఎట్టకేలకు తలొగ్గినట్లు కనిపిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శార్ధూల్ జెర్సీ నెంబర్ 10 కాకుండా నెంబర్ 54 జెర్సీని ధరించాడు.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ పేసర్ అప్పట్లో తన ప్రదర్శన కంటే జెర్సీతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది. బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
లంకపై జరిగిన నాలుగో వన్డేలో శార్దూల్ ఈ జెర్సీ ధరించడాన్ని గుర్తించిన క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే ఫొటోను షేర్ చేశాడు. దీంతో సచిన్‌కు తప్ప ఆ జెర్సీని ధరించే అర్హత మరెవరికీ లేదని, ఆ జెర్సీ కథ ఇక ముగిసిందని, అది దేవుడిదని, వేరెవరికీ దానిని ధరించే అర్హత లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అయితే, తనపై వచ్చిన విమర్శలకి అప్పట్లో శార్ధూల్ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. న్యూమరాలజిస్ట్ సూచన మేరకే తాను ఆ నెంబరు జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తాను అక్టోబరు 16, 1991లో జన్మించానని పేర్కొన్నాడు. దీని ప్రకారం [(1 6) (1 0) (1 9 9 1) = 7 1 (2 0) = 10] 10.. అని వివరించాడు.
అందుకనే తాను నెంబర్ 10 జెర్సీని ధరిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో శార్దూల్ నెంబర్ 54 కలిగిన జెర్సీని ధరించాడు. దిగ్గజ క్రికెటర్‌ను అవమానించే రీతిలో వ్యవహరించడం కెరీర్‌కి మంచిది కాదని శ్రేయోభిలాషులు చెప్పడంతో అతను తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.