మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 86 పరుగుల పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇక మూడు టీ20ల సిరీస్‌లో మిగిలిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీస్కోర్ చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(74; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్(53; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(41; 39 బంతుల్లో, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమి గల కారణాలను బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో వివరించాడు.
తొలి టీ20లో చేసిన తప్పిదాలే మరోసారి రిపీట్ చేసి మ్యాచ్‌ను కోల్పోయామని షాంటో పేర్కొన్నాడు. ''తొలి జట్టులో చేసిన తప్పిదాలే మరోసారి పునరావృతం చేశాం. ఇది జట్టుకు మంచిది కాదు. ప్రదర్శన పరంగా మేం మెరుగుపడాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం సరైనదిగానే భావిస్తున్నా. 6-7 ఓవర్ల తర్వాత భారత్ బ్యాటింగ్ బాగా చేసింది. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించలేకపోయాం. ఇక మా బ్యాటర్లు బాధ్యత తీసుకుని ఆడాల్సింది. భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు'' అని షాంటో పేర్కొన్నాడు.