భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రాలతో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ హెచ్చరించాడు. మ్యాచ్ ఫలితాలను పంత్, బుమ్రా తారుమారు చేయగలరని వాట్సన్ కొనియాడాడు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు కఠినమైన సవాలుగా మారుతారని పేర్కొన్నాడు. షేన్ వాట్సన్ అనూహ్యంగా విరాట్ కోహ్లి గురించి ఆస్ట్రేలియాకు ఎలాంటి హెచ్చరికలు జారీచేయకపోవడం గమనార్హం.
అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది.
2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది.

''గత ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాటింగ్ కోణం నుంచి రిషభ్ పంత్‌కు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. గబ్బాలో అతను చాలా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గత రెండు సంవత్సరాలు అతను అధిగమించిన సవాళ్లను దాటి గొప్ప ప్లేయర్‌గా పునరాగమనం ఇచ్చిన తీరును చూస్తుంటే.. పంత్ ఆస్ట్రేలియా సిరీస్‌లో మరోసారి ప్రధానపాత్ర పోషించనున్నాడనిపిస్తుంది''
''ఇక బుమ్రా కూడా. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో ఎంతో గొప్ప ప్లేయర్‌గా నిలుస్తాడు. ఆసీస్‌లోనే కాదు, ఏ పరిస్థితులు అయినా అతనికి నప్పుతాయి. అతని సామర్థ్యం వికెట్ల తీయడం, బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చడం. ఆస్ట్రేలియాలోనూ అదే ప్రభావంతో బౌలింగ్ చేస్తాడని భావిస్తున్నా. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తే ఆస్ట్రేలియాకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి'' అని షేన్ వాట్సన్ పేర్కొన్నాడు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.