ఇదే ఆటగాళ్లతో కొనసాగితే.. భవిష్యత్‌లోనూ ముంబైని ఓడించడం కష్టమే: వాట్సన్

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే.. భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ముంబై అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఆ జట్టును వేలెత్తి చూపడానికి ఏమీ లేదన్నాడు. ఈ సీజన్‌లో ఆడినన్ని రోజులూ రోహిత్ సేన మెరుగవుతూనే ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు. మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది.

ప్రపంచ శ్రేణి ఓపెనర్లు:
ఐపీఎల్ 2020 ఫైనల్ గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టును అభినందిస్తూ షేన్ వాట్సన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. 'ముంబై జట్టుకు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ లాంటి ప్రపంచ శ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వారు ఎలా ఆడుతారో మనందరికీ తెలిసిందే. తర్వాత సూర్యకుమార్ యాదవ్. గత మూడు సీజన్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో కొన్ని అద్భుత మ్యాచులు ఆడాడు. త్వరలోనే భారత జట్టులో ఆడే అవకాశం ఉంది. అతడికి ఈ సీజన్ మంచిగా మిగిలిపోతుంది' అని వాట్సన్ అన్నాడు.

ఇదే జట్టుతో కొనసాగితే:
'ఇషాన్ కిషన్ తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ లేనపపుడు ఓపెనర్‌గా ఆడినా, అవసరాన్ని బట్టి మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగినా అద్భుతంగా రాణించాడు. హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లాంటి అత్యుత్తమ ఫినీషర్లు ఉండడంతో ముంబై జట్టు మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇద్దరూ క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మారుస్తారు. వీరందరినీ పరిగణలోకి తీసుకుంటే ముంబైని ఓడించడం కష్టతరం. మరికొన్నేళ్లు ఇదే జట్టుతో కొనసాగితే.. భవిష్యత్‌లో ఇంకా ప్రమాదకరంగా మారుతుంది' అని షేన్ వాట్సన్ చెప్పడు.

11 మ్యాచ్‌ల్లో 299 పరుగులు:
ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరిసారి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ మొత్తం 11 మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇక ఈ టీ20 లీగ్ మొత్తంలో 145 మ్యాచ్‌లు ఆడగా.. 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. చెన్నై ఇలా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్, సెమీస్ లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈసారి మాత్రం చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ 2020ని 7వ స్థానంతో ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications