
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఆటతీరును కనబర్చింది. తొలుత రవీంద్ర జడేజా కెప్టెన్సీ వహించగా.. వరుస ఓటములతో ఇబ్బంది పడ్డ జడేజా.. మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీని తిరిగి అప్పగించాడు. జడ్డూ కెప్టెన్సీలో తన మొదటి ఎనిమిది గేమ్‌లలో చెన్నై రెండింట్లో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకు 10మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించి.. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ఈ సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలని సీఎస్కే లక్ష్యంగా పెట్టుకుంది. తాను తిరిగి కెప్టెన్సీ చేపట్టిన సందర్భంగా ధోనీ కామెంటేటర్‌తో మాట్లాడుతూ.. చెన్నై జెర్సీ అయిన ఎల్లో జెర్సీలో కన్పించడం ఇదే చివరిసారి కాదని పేర్కొన్నాడు. తర్వాతి సీజన్ ఆడతాడో లేదో అనే డైలామాను క్రియేట్ చేశాడు.
"మీరు నన్ను కచ్చితంగా ఎల్లో జెర్సీలో చూస్తారు. అయితే ఈ ఎల్లో జెర్సీనా లేదా మరేదైనా ఎల్లో జెర్సీనా అనేది తెలుసుకోవాలంటే మీరు వెయిట్ చేయాల్సిందే' అని ధోనీ కెప్టెన్సీ చేపట్టినప్పుడు కామెంటేటర్‌తో అన్నాడు. అయితే ఈ విషయమై ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ షేన్ వాట్సన్ పెదవి విప్పాడు. 2018 నుంచి 2020 మధ్యకాలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్.. ధోనీ ప్రకటన ఆంతర్యం ఏమిటో వెల్లడించాడు. ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీకి కోచింగ్ పాత్రను చేపట్టగలడని సూచించాడు.

ఓ పోడ్ కాస్ట్‌లో వాట్సన్ మాట్లాడుతూ.. 'నేను అనుకుంటుందేంటంటే.. ధోనీ 'డిఫరెంట్ ఎల్లో (జెర్సీ)'లో కన్పిస్తా అన్నాడంటే.. అతను బహుశా ప్లేయర్ జెర్సీలో కాకుండా.. కోచ్ జెర్సీలో కన్పిస్తానని హింట్ ఇచ్చాడేమో. ధోనీ తాను ఆటకు ముగింపు పలికాక.. సీఎస్కేతో సంబంధం లేకుండా ఉంటాడని నేను అనుకోను. సీఎస్కేతో సంబంధం తెంచుకుంటే నేను చాలా ఆశ్చర్యపోతా. అతను కేవలం సీఎస్కేకు మాత్రమే బౌండ్ అయి ఉంటాడు. నేను అతనితో చాలా సార్లు మాట్లాడినప్పుడు నాకు ఆ విషయం బోధపడింది. ఒక వేళ ఆడడం ఆపేసినా.. అతను కోచ్ గానూ లేదా క్రికెట్ డైరెక్టర్‌గాను సీఎస్కే తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తాడని నాకు తెలుసు. ఒకవేళ తను ఆటకు ముగింపు పలికాక.. సీఎస్కే కోచింగ్ స్టాఫ్‌లో అతను లేకపోతే నేను షాక్‌కు గురికావడం ఖాయం. అయితే ఇప్పటికీ ప్లేయర్‌గా ధోనీ రాణిస్తూనే ఉన్నాడని వాట్సన్ అన్నాడు.