సిడ్నీ: ఆదివారం సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్ 71 బంతుల్లోనే 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో పది ఫోర్లు ఆరు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో షేన్ వాట్సన్ రికార్డులు సృష్టించాడు.
షేన్ వాట్సన్ మూడో ట్వంటీ 20కి కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఆరోన్ ఫించ్ గాయపడటంతో వాట్సన్ పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్న వాట్సన్ తన బ్యాటింగుతో అలరించాడు. భారత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. వాట్సన్ 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేశాడు.
ఇది అతనికి కలిసి వచ్చింది. వాట్సన్‌కు ట్వంటీ 20ల్లో ఇదే తొలి సెంచరీ. గతంలో అతని అత్యధిక పరుగులు 81గా ఉంది. ఇప్పుడు 124 పరుగులు చేశాడు. తాజా మ్యాచులో అతని స్ట్రయిక్ రేటు 174.64గా ఉంది.

ఓ కెప్టెన్‌గా ప్రత్యర్థి జట్టు పైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డ్ వాట్సన్ పేర ఇప్పుడు నమోదయింది. గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ 119 పరుగులు కెప్టెన్‌గా చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును వాట్సన్ బద్దలు చేశాడు.
ఈ మ్యాచ్ వాట్సన్‌కు ప్లస్ అని చెప్పవచ్చు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫిబ్రవరి 6వ తేదీన ఉంటుంది. ఇలాంటి సమయంలో వాట్సన్‌కు ఇది కలిసి వచ్చే అంశం. ఐపీఎల్లో అతని ప్రాథమిక ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు.
వాట్సన్ రికార్డులు
ఈ మ్యాచులో 124 పరుగులు చేయడం ద్వారా.. ట్వంటీ 20లో ఓ కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వాడిగా వాట్సన్ నిలిచాడు. గతంలో డుప్లెసిస్ (119) పేరిట ఈ రికార్డ్ ఉంది.
ట్వంటీ 20 మ్యాచ్ కెప్టెన్సీ తీసుకొన్న తొలి మ్యాచులోనే సెంచరీ చేసిన వ్యక్తి వాట్సన్.
భారత్ జట్టు పైన మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, ట్వంటీ 20లు) సెంచరీ చేసిన తొలి బ్యాట్సుమన్ వాట్సన్.
భారత్ పైన ట్వంటీ 20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడు షేన్ వాట్సన్.
మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్సుమన్ షేన్ వాట్సన్.
124 నాటౌట్... ట్వంటీ 20 ఫార్మాట్లో ఇలా నిలిచిన రెండో వ్యక్తి షేన్ వాట్సన్. 2013 ఆరోన్ ఫించ్ ఇంగ్లాండ్ పైన 156 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా జట్టులో ట్వంటీ 20 మ్యాచులలో సెంచరీ చేసిన రెండో బ్యాట్సుమన్ షేన్ వాట్సన్. ఆరోన్ ఫించ్ తర్వాత సెంచరీ చేసింది వాట్సనే.