సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై స్ఫిన్ దిగ్గజం షేన్‌వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని షేన్‌వార్న్ పేర్కొన్నాడు. ఓ టీవీ ఛానల్‌లో 'ఐయామ్ ఏ సెలబ్రిటీ' కార్యక్రమానికి హాజరైన షేన్ వార్న్ మాట్లాడుతూ అతడిని ఇష్టపడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పాడు.
స్టీవ్ వాను అత్యంత సెల్ఫిష్ క్రికెటర్ గా అభివర్ణించిన వార్న్ 1999లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ గురించి ప్రస్తావించాడు. ఆ సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌కు తనను స్టీవ్ దూరం చేశాడని, ఆ సమయంలో తాను చాలా నిరాశ చెందానని పేర్కొన్నాడు.
ఆ టెస్టు మ్యాచ్‌లో గెలిస్తేనే ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే సెలక్షన్‌కు ముందు స్టీవ్ వా తనతో నేను ఆడటం లేదని చెప్పాడు. దీంతో ఎందుకు అని నేను ఎదురు ప్రశ్నించినప్పటికీ, కెప్టెన్‌గా చెబుతున్నాను. నువ్వు ఆడటం లేదని స్టీవ్ వా తేల్చి చెప్పాడు.

ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో ఒక్కడైన షేన్ వార్న్‌ను ఆ మ్యాచ్ నుంచి తప్పించడంతో జట్టులోని తోటి ఆటగాళ్లు కూడా కాస్తంత నిరాశ చెందారు. ఆ నిర్ణయంతో సుమారు 10 సంవత్సరాల పాటు తాను నిరాశ చెందినట్లు వార్న్ తెలిపాడు.
ఆ సమయంలోనే తన భుజానికి ఆపరేషన్ జరిగిందని తెలిపాడు. ఈ విషయంలో మాత్రమే కాదు, చాలా విషయాల్లో స్టీవ్ వా తనకు నచ్చలేదని వార్న్ టీవీలో పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే ఆ చివరి టెస్టులో వెస్టిండిస్‌పై ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకుంది.