
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్ట సమయం గూరించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆ భారాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజాయితీగా మాట్లాడిన వార్న్ పలు విషయాలను చెప్పాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఉండే వార్న్ ఆటతోనే కాకుండా వివాదాలతో కూడా అత్యంత ఆదరణ పొందాడు. అతని జీవితంలో పలు చీకటి కోణాలు కూడా ఉన్నాయి.
తన భార్య సిమోన్ కల్లాహన్‌తో విడాకులు తీసుకోవడం తన జీవితంలోని కష్ట క్షణాలల్లో ఒకటని షేన్ వార్న్ పేర్కొన్నాడు. అంతేకాకుండా అది తన తప్పేనని వార్న్ చెప్పాడు. అది తన జీవితంలో అత్యల్ప స్థానంగా పేర్కొన్నాడు. 2005లో తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్న్ గుర్తు చేసుకున్నాడు.
తమతోపాటు తమ పిల్లలు బ్రూక్, జాక్సన్, సమ్మర్‌కు కూడా అది కష్ట సమయం అని చెప్పుకొచ్చాడు. కానీ అది తన వల్లే జరిగిన తప్పు కాబట్టి తాను జీవితాంతం దానిని భరించాలని అన్నాడు. ఆ సంఘటన ఇంగ్లండ్‌లో జరగనున్న యాషెస్ సిరీస్‌కు వారం రోజుల ముందు జరిగిందని తెలిపాడు. అప్పుడు తన పిల్లలు కూడా తనతో పాటే యాషెస్ సిరీస్ కోసం విమానంలో ప్రయాణించవలసి వచ్చిందని వార్న్ గుర్తు చేసుకున్నాడు.
క్రికెట్ చరిత్రలోని ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో షేన్ వార్న్ ఒక్కడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో మొత్తంగా 145 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మ్యాచ్‌లో 12 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ పలు మార్లు 17 సగటుతో 3154 పరుగులు చేశాడు. 12 సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా అత్యధిక స్కోర్ 99 పరుగులు. ఇక 194 వన్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు తీశాడు. అత్యధికంగా ఓ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు. మొత్తంగా 16 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాడు.