
జట్లన్నీఇదే వ్యూహం అమలుచేయొచ్చు:
షేన్ బాండ్ తాజాగా పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బుమ్రా నాణ్యమైన బౌలర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్టార్ బౌలర్‌పై కచ్చితంగా అంచనాలు ఉంటాయి. బుమ్రా బౌలింగ్‌ను కివీస్ బాగా ఆడింది. అతడిని ఓ 'రిస్క్'గా గుర్తించిన న్యూజిలాండ్ చాలా జాగ్రత్తగా ఎదుర్కొంది. అతడిని వదిలేసి పెద్దగా అనుభవం లేని మిగతా బౌలర్లపై దాడికి దిగింది. మిగతా అన్ని జట్లు కివీస్ పద్ధతినే అనుసరించొచ్చు. అందుకే ఒక బౌలింగ్ బృందంగా ప్రభావం చూపించడమే కీలకం' అని అన్నారు.

బుమ్రా చెత్తగా బౌలింగ్ చేయలేదు:
'న్యూజిలాండ్‌లో వికెట్లు ఫ్లాట్‌గా ఉంటాయి. బౌలింగ్ వేయడం అంత సులభం కాదు. వన్డే సిరీస్‌లో బుమ్రా మరీ అంత చెత్తగా బౌలింగ్ చేయలేదు. పరుగులను నియంత్రించాడు. కానీ.. కొన్ని సార్లు వికెట్లు దక్కవు. కొంతకాలం పాటు జట్టుకు దూరమైన తర్వాత మళ్లీ వచ్చి గాడిలో పడడం కొంత కష్టమైన పనే. పునరాగమనం చేయగానే లయ అందుకోలేరు. కాస్త సమయం పడుతుంది. పరిమిత ఓవర్లలో బుమ్రాను న్యూజిలాండ్ బాగానే ఎదుర్కొన్నప్పటికీ.. టెస్టుల్లో అతడి ప్రభావం బాగానే ఉంటుంది. టెస్టు సిరీసులో బుమ్రా ప్రభావం చూపిస్తాడనడంలో సందేహం లేదు' అని బాండ్ పేర్కొన్నారు.

వాగ్నర్‌ను ఎదుర్కోవడం సవాలే:
'కివీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించవు. తొలి రోజు బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. కివీస్ ఒక్క స్పిన్నర్‌నూ ఆడించకపోయినా ఆశ్చర్యం లేదు. ఆటసాగే కొద్దీ పిచ్‌లు ఫ్లాట్‌గా మారతాయి. సొంతగడ్డపై నీల్ వాగ్నర్ బౌన్సర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు సవాలే. టెస్టులకు పెద్ద మైదానాలు కాబట్టి అతడి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇక యువ పేసర్ జేమీసన్ టెస్టు అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు' అని బాండ్ చెప్పుకొచ్చారు.

టాప్ కోల్పోయిన బుమ్రా:
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా.. ఏకంగా 45 రేటింగ్ పాయింట్లు కోల్పోయి ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంకు పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌తో వన్డే సిరీస్ ఆడకపోయినా ట్రెంట్ బోల్ట్ 727 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 719 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












