హైదరాబాద్: న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ ప్రధాన కోచ్ కావాలనే తన కోరికను మీడియా ఎదుట వెల్లడించాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏదైనా జట్టుకు చీఫ్ కోచ్‌గా పని చేయాలని ఉందని తన ఆసక్తిని వివరించాడు.
'ప్రధాన కోచ్ పాత్ర పోషించాలని అనుకుంటున్నా. ఇది ఎలా కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఐపీఎల్, బ్రిస్బేన్‌లతో పనిచేసే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషిస్తాను' అని షేన్ బాండ్ అన్నాడు. గత ఏడు సంవత్సరాలుగా సహాయక కోచ్‌గా పని చేస్తున్న బాండ్ భారత పర్యటనకు వస్తున్న న్యూజిలాండ్-ఎ కోచ్‌గా తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్రస్తుతం షేన్ బాండ్ న్యూజిలాండ్ జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్, బిగ్‌బాష్ టోర్నీలలో తన సేవలను అందిస్తున్నాడు. 'బౌలింగ్ కోచ్‌గా ఉండటాన్ని తాను ఆస్వాదిస్తానని, అయితే హెడ్ కోచ్‌గా ఉండే వ్యక్తిగతంగా కూడా వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుంది' అని అన్నాడు.

నాలుగు రోజుల మ్యాచ్‌తో పాటు, పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం న్యూజిలండ్-ఎ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పని చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలను 42 ఏళ్ల బాండ్ ఖండించాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్‌కు దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా అవకాశం రావడంతో త్వరలో అతను ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. దీంతో గిబ్సన్ స్థానంలో షేన్‌బాండ్ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.