బంగ్లాదేశ్ ఉతికి పారేస్తే.. పాక్ కెప్టెన్ మళ్లీ సోది మొదలుపెట్టిండు!
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పసికూనగా భావించే బంగ్లాదేశ్ చేతిలో 2-0తో వైట్ వాష్ అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ చారిత్రాత్మక ఓటమి పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే ఓ పెద్ద మచ్చగా మిగిలిపోనుంది. ఈ ఘోర పరాజయం తర్వాత పాక్ కెప్టెన్ షాన్ మసూద్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పే అలవాటున్న పాక్ కెప్టెన్.. ఈ సారి కూడా మీడియా ముందుకు వచ్చి తనదైన స్టైల్లో సుదీర్ఘ వివరణలు ఇస్తూ వింత కామెంట్స్ చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నగరంలో జరిగిన రెండో టెస్టులో బంగ్లా జట్టు అద్భుత ప్రదర్శనతో 78 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రను ఒకసారి తిరగేస్తే.. బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టు చేతిలో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ కోల్పోవడం.. అందులో క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సిరీస్‌లో పాక్ జట్టు ఆటతీరు మొదటి నుంచి దారుణంగా సాగింది. అంతకుముందు ఢాకాలో జరిగని మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ 104 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టి ఓడించింది. ఈ ఘోర పరాజయాల పరంపర తర్వాత పాక్ కెప్టెన్ షాన్ మసూద్ తన గుండెల్లోని బాధను వ్యక్తపరుస్తూ.. జట్టు వైఫల్యాలపై మాట్లాడాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో షాన్ మసూద్ మాట్లాడుతూ.. జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు కీలక విభాగాల్లోనూ ఘోరంగా విఫలమైందని నిర్మొహమాటంగా అంగీకరించాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో జట్టు పోరాడినప్పటికీ ఓటమి తప్పకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మేము ఈ మ్యాచ్‌లో చాలా తప్పులు చేశాం. సాధారణంగా ఒక మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక జట్టు 360 పరుగులు బోర్డుపై ఉంచినప్పుడు ఫలితం మనకు అనుకూలంగా ఉంటుందని, మ్యాచ్ మనమే గెలుస్తామని ఆశిస్తాం. కానీ ఈ మ్యాచ్‌లోని మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో మేము చేసిన వ్యూహాత్మక తప్పుల వల్లే తీవ్రంగా వెనుకబడిపోయాం. ఆ తప్పుల కారణంగానే మా ముందు ఒక భారీ లక్ష్యం నిలిచింది. దీనిపై మేము కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని షాన్ మసూద్ పేర్కొన్నాడు.
ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లు, ఫీల్డర్లు ప్రదర్శించిన అలసత్వాన్ని కెప్టెన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒకానొక సమయంలో బంగ్లాదేశ్ జట్టు కేవలం 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడిందని, ఆ సమయంలో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించడంలో పాకిస్థాన్ విఫలమైందని అన్నాడు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కీలక పరుగులు జోడించడాన్ని.. అలాగే తమ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ల బాధ్యతారాహిత్యాన్ని ఆయన తప్పుబట్టాడు. "బంగ్లాదేశ్ 116 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన తర్వాత, వారి చివరి నాలుగు వికెట్లు కలిసి చాలా పరుగులు చేసేశాయి. అక్కడ మేము వికెట్లు తీసే సులువైన అవకాశాలను చేజార్చుకున్నాం. ఆ తర్వాత మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 142 పరుగులకు 4 వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో ఇద్దరు సెట్ బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లాల్సింది. టెస్ట్ క్రికెట్‌లో ఇలాంటి అనుకూల పరిస్థితులను అందిపుచ్చుకుని భారీ స్కోర్లు చేయాలి. మేము మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో చేసిన తప్పుల వల్లే, చివరి రోజుల్లో మా ఆటగాళ్లు చేసిన గట్టి ప్రయత్నం కూడా వృథా అయింది" అని చెప్పుకొచ్చాడు.
టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు ఎదుర్కొంటున్న గడ్డు కాలం, వరుస వైఫల్యాలపై షాన్ మసూద్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ అనేది తప్పులను అస్సలు క్షమించదని వ్యాఖ్యానించాడు. "టెస్ట్ క్రికెట్‌లో మీరు చేసే చిన్న తప్పుకైనా మైదానంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఆట చాలా నిర్దయాత్మకమైనది, క్రూరమైనది. ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల మధ్యే అసలైన పోటీ ఉంటుంది. మైదానంలో నిరంతరం కఠినంగా శ్రమించకుండా ఏ మ్యాచ్ కూడా అంత సులభంగా గెలవలేము. ఒక జట్టుగా ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో మేము చేయాల్సింది అదే" అని షాన్ మసూద్ స్పష్టం చేశాడు. అయితే కెప్టెన్ ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ.. ఈ సిరీస్ ఓటమితో పాకిస్థాన్ క్రికెట్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఘోరంగా మసకబారిందనేది మాత్రం పచ్చి నిజం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications