కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమను ప్రేమించే అభిమానులు ఎక్కువగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఓ న్యాయవాది ఏకంగా అఫ్రిదీకి లీగల్ నోటీసులు పంపాడు.
లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ నోటీసులు జారీచేశాడు.
టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది.ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అంటూ అన్నాడు.
అఫ్రిదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాక్ లాయర్ లీగల్ నోటీసులు పంపారు. పాక్ మీడియా కూడా అఫ్రీది వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది ఇలా ఉండగా, షోయబ్ మాలిక్ కూడా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎలాంటి ప్రత్యేక భద్రతను తీసుకోలేదని చెప్పాడు. ఇక్కడ తాము భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఇక్కడ చెప్పలేనంత ప్రేమను పొందానని తెలిపాడు.

సిగ్గు పడేలా ఉన్నాయి: మియాందాద్
ఇది ఇలా ఉండగా అఫ్రిదీ వ్యాఖ్యలను సిగ్గుపడేతా ఉన్నాయని, ఎంతో బాధను కలిగించాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ తీవ్రంగా స్పందించారు. అఫ్రిదీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమను తామే అవమానించుకునేలా చేశారని అన్నారు.
'మనకు భారతీయులు ఏమీ ఇచ్చారు?. భారతదేశంలో ఉన్నప్పటికీ నిజం మాట్లాడాలి. గత ఐదేళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ కోసం వారు(ఇండియా) ఏమిచ్చారు? ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ జట్టుకు ఆడుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం' అని మియాందాద్ చెప్పాడు. విదేశాలకు వెళ్లినప్పుడు ఏం మాట్లాడాలో ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని తెలిపాడు.
క్రికెటర్‌గా అక్కడికి వెళ్లి మ్యాచులు ఆడి రావాలే తప్ప.. అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. అఫ్రిదీ, మాలిక్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పాకిస్థాన్ మాజీ టెస్ట్ ఓపెనర్, చీఫ్ కోచ్ మోహిసిన్ ఖాన్ అన్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు సీనియర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.