
హైదరాబాద్: ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 3 నుంచి సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శనివారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కొత్త బౌలింగ్ కోచ్ డానియెల్ వెటోరి పర్యవేక్షణలో బంగ్లాదేళ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
శుక‍్రవారం మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌కు దాదాపు అందరూ హాజరైనప్పటికీ సీనియర్ ప్లేయర్ షకీబ్ ఉల్ హాసన్ మాత్రం హాజరు కాలేదు. షకీబ్ నాయకత్వంలోని బంగ్లా క్రికెటర్లు సోమవారం తమ 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.
దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించారు. 11 ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగగా అందులో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు 35 వేల నుంచి లక్ష టకాలకు పెంచడం, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల జీతాలను 50 శాతానికి పెంచడం ముఖ్యమైన డిమాండ్లు.
క్రికెటర్ల డిమాండ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో షకీబ్ ఉల్ హాసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించారు. దీంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయింది. దీంతో బంగ్లా క్రికెటర్లు శనివారం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇటీవలే బంగ్లా జట్టు బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన డానియేల్ వెటోరి ఆటగాళ్లకు బంతులు విసురుతూ ప్రాక్టీస్ చేయించాడు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకూ వెటోరి బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న జరిగే తొలి టీ20తో భారత్‌లో బంగ్లాపర్యటన షురూ కానుంది. అక్టోబర్ 30న బంగ్లా క్రికెటర్లు భారత్‌కు రానున్నారు.