
న్యూ ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌కు ధీటుగా బంగ్లా జట్టు పోరాడింది. చివరి బంతి వరకూ పోరాడి తీరుతామని చెప్పిన బంగ్లా కెప్టెన్ మష్రఫె మోర్తజా అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నాడు. చివరి బంతి వరకూ విజయం కోసం పోరాడిన బంగ్లాదేశ్ క్రికెట్‌ను గాయల బెడద వెంటాడుతోంది. ప్రముఖ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
తాజాగా బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు ఢాకాలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు అతడు ఆటకు దూరంకానున్నాడు. చేతి వేలి గాయం కారణంగా రెండు రోజుల క్రితం ముగిసిన ఆసియాకప్‌లో ఆ జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఎడమచేతి వేలికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఇంకా ఆలస్యం చేస్తే అది కాస్త మణికట్టు మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని షకిబ్ పేర్కొన్నాడు. మరికొన్ని రోజుల పాటు ఆలస్యం చేస్తే పరిస్థితి చాలా ప్రమాదంగా ఉండేదని డాక్టర్లు చెప్పినట్లు అతడు తెలిపాడు. సర్జరీ తరువాత కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నాడు.
దీంతో మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించాడు. ఆసియా కప్ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్ స్వదేశంలో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో జరిగే సిరీస్‌లకు అతడు ఇంటికే పరిమితంకానున్నాడు. భారత్ తర్వాతి టోర్నీని వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆతిథ్య భారత్‌తో పోరాడేందుకు వెస్టిండీస్.. ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.