Shakib Al Hasanపై కఠిన చర్యలు.. నిషేధంతో పాటు భారీ జరిమానా!

ఢాకా: ఓ దేశవాళీ మ్యాచ్‌లో మితిమీరిన కోపంతో ఒకసారి వికెట్లను తన్నడమే కాక.. మరోసారి పిచ్‌ నుంచి స్టంప్‌లను పీకి పడేసిన బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. క్రికెట్ సమాజం తలదించుకునేలా, గల్లీ క్రికెట్‌లా ప్రవర్తించిన షకీబ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 5 లక్షల టాకాలు(5800 డాలర్లు) జరిమానా విధించింది. షకీబ్‌ ప్రవర్తనకు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని అనుకున్నా తక్కువ శిక్షతో అతడిని వదిలి పెట్టింది.

అసలేం జరిగిందంటే..

ఢాకా వేదికగా జరుగుతున్న ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌) 2021లో మహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న షకీబ్ ఉల్‌.. అబహాని లిమిటెడ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్‌ పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌ను షకీబ్ అల్ హసన్‌ వేయగా.. ముష్ఫికర్ రహీమ్ వరుసగా 6, 4 బాదేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన షకీబ్ అల్.. అదే ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షకీబ్ అల్.. వికెట్లని గట్టిగా కాలితో తన్నాడు. అంతటితో ఊరుకోకుండా అంపైర్‌తో గొడవకు దిగాడు.

వికెట్లను పీకి పారేసాడు..

వికెట్లను పీకి పారేసాడు..

ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో వర్షం మొదలవడంతో.. ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని నిలిపివేశారు. దాంతో మరోసారి షకీబ్ అల్ హసన్‌ సహనం కోల్పోయి హద్దులు దాటాడు. తన ఫీల్డింగ్‌ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబ్ అల్ మూడు స్టంప్స్‌ను ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్‌ను తీసుకొని మళ్లీ అంపైర్‌ కాళ్ల దగ్గర పడేశాడు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 6 ఓవర్లు పూర్తి కావాల్సి ఉన్నందున.. ఆ ఆఖరి బంతిని వేయించాలని అతను డిమాండ్ చేశాడు. కానీ అంపైర్లు తిరస్కరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

చెవులు పిండిన సెహ్వాగ్..

షకీబ్ అల్‌ హసన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 212 వన్డేలు, 76 టీ20లు, 57 టెస్టులాడిన షకీబ్ అల్‌ ఓ గల్లీ క్రికెటర్‌లా వ్యవహరించాడని మండిపడుతున్నారు. ఇలాంటి క్రికెటర్లు మనకు అవసరమా? అంటూ ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ లిసా స్టాలేకర్ ప్రశ్నించారు. గతంలోనూ ఆ దేశ క్రికెటర్లు మైదానంలో హద్దులు దాటిని తీరుని ఆమె గుర్తుచేశారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గతంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా.. షకీబ్ అల్‌ హసన్ చెవి పట్టుకుని మెలిపెడుతున్న ఫొటోని తాజాగా షేర్ చేశాడు. అతనికి అదే సరైన శిక్ష అన్నట్టు వీరూ పేర్కొన్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీడియా అత్యుత్సాహం..

మీడియా అత్యుత్సాహం..

షకీబ్ అల్‌ హసన్‌ను ప్రతిదాంట్లో విలన్‌గా చిత్రీకరిస్తున్నారని అతని భార్య ఉమ్మే అల్‌ హసన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అసలు విషయాన్ని వదిలేసి.. తన భర్త తీరునే హైలైట్‌ చేస్తోందని మండిపడ్డారు. అంపైర్‌ తప్పుడు నిర్ణయాలను వదిలేసి షకీబ్ అల్‌ గురించి హెడ్‌లైన్లు రాయడం తనను తీవ్రంగా కలచివేసిందని ఉమ్మే పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు.

‘ఈ ఘటనపై టీవీల్లో వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని కొందరు అభిమానులు అర్థం చేసుకొని అండగా నిలిచారు. కానీ మీడియా అసలు విషయాన్ని వదిలేసి షకీబ్ అల్‌ ఆగ్రహంతో ప్రవర్తించిన తీరునే హైలైట్‌ చేయడం బాధగా అనిపించింది. ఇక్కడ ప్రధానమైంది అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు. దాన్ని వదిలేసి షకీబ్ అల్‌ గురించి హెడ్‌లైన్లు రాయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. కొంత కాలంగా ప్రతి విషయంలోనూ నా భర్తని విలన్‌గా చిత్రీకరించడానికి చూస్తున్నారని నాకు అనుమానం కలుగుతోంది' అని ఉమ్మే పేర్కొన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, June 13, 2021, 8:55 [IST]
Other articles published on Jun 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X