
హైదరాబాద్: డెహ్రాడూన్ వేదికగా అఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది బంగ్లాదేశ్. గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోయి క్లీన్ స్వీప్‌కు గురైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ప్లేయర్లు బాగానే రాణించినప్పటికీ చేధనలో అఫ్ఘాన్ బౌలర్ల చేతికి చిక్కి ఆఖరి బంతికి ఓటమి పాలైయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకూ కేవలం కపిల్ దేవ్ కూడా అందుకోలేని ఘనత సాధించాడు.
దీంతో.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన క్లబ్‌లో చోటు సంపాదించాడు. అప్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో నజీబుల్లా జద్రాన్ వికెట్ తీసిన షకీబుల్.. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అన్ని అంతర్జాతీయ క్రికెట్లో పది వేల పరుగులు, 500 వికెట్లు పడగొట్టిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ జాక్వెస్ కలిస్, షాహిద్ అఫ్రిదీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
ఆల్‌రౌండర్‌గా దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించిన కలిస్.. 519 మ్యాచ్‌ల్లో 25534 పరుగులు, 577 వికెట్లు సాధించాడు. తర్వాతి స్థానంలో ఉన్న షాహిద్ అఫ్రిదీ 524 మ్యాచ్‌ల్లో 11196 రన్స్, 541 వికెట్లను సొంతం చేసుకున్నాడు. షకీబుల్ హసన్ కేవలం 302 మ్యాచ్‌ల్లోనే 10102 పరుగులు చేయడతోపాటు 500 వికెట్లు తీశాడు. మిగతా ఇద్దరి కంటే షకీబుల్ వేగంగా ఈ క్లబ్‌లో చేరడం గమనార్హం.
భారత్ తరఫున కపిల్ దేవ్ మాత్రమే ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు. టీమిండియా చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కపిల్ దేవ్... 356 మ్యాచ్‌ల్లో 9031 పరుగులు చేయడంతోపాటు 687 వికెట్లు పడగొట్టాడు.