బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. భారత్‌తో కాన్పూర్ వేదికగా రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకిబ్ ఈ ప్రకటన చేశాడు. టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్ రిటైర్మెంట్ గురించి షకిబ్ కీలక విషయాలు పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఇక బంగ్లాదేశ్‌లో మీర్‌పూర్ వేదికగా తన ఫైనల్ టెస్టు ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే భద్రతా సమస్యలు తలెత్తితే రేపటి టెస్టు మ్యాచే తన చివరిది కావొచ్చని షకిబ్ పేర్కొన్నాడు. అక్టోబర్ 21 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఆడనుంది.

అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. షేక్ హసీనా ప్రభుత్వం రద్దు అవ్వడంతో తన ఎంపీ పదవినీ షకిబ్ కోల్పోయాడు. మరోవైపు షకిబ్‌పై హత్యానేరం కింద కేసు కూడా నమోదైంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన రుబెల్ అనే యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 28వ నిందితుడిగా షకిబ్ ఉన్నాడు.
కాగా, 2007 టీ20 ప్రపంచకప్ నుంచి ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ వరకు షకిబ్ బంగ్లాదేశ్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా 50 వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. ''రిటైర్మెంట్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెప్పాను. చివరి టెస్టు మీర్‌పూర్ వేదికగా ఆడాలని ఉందని తెలిపాను. బోర్డు దీనికి అంగీకరించింది. టెస్టు నిర్వహించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే అది సాధ్యంకాకపోతే కాన్పూర్ వేదికగా భారత్‌తో జరిగే టెస్టే ఆఖరిది'' అని షకిబ్ పేర్కొన్నాడు.