హైదరాబాద్: షాయ్ హోప్ (118 నాటౌట్) అద్భుత సెంచరీతో పాటు బ్రాత్ వైట్ (95) పోరాటంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండిస్ చారిత్రక విజయాన్ని సాధించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండిస్, రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుని 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో మూడో టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్‌కు షాయ్ హోప్ వరుసగా రెండో సెంచరీ చేసి అద్భుతమైన విజాయన్ని అందించాడు. 5/0 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండిస్ ఇంకో నాలుగు ఓవర్లు మిగిలుండగా లక్ష్యాన్ని చేధించింది.

ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ పావెల్ (23) వికెట్‌ను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. వన్ డౌన్‌లో వచ్చిన కైల్ హోప్ పరుగులేమీ చేయకుండా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో బ్రాత్ వైట్‌కు జతకలసి షాయ్ హోప్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
2000 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై విండీస్ టెస్టు విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ బ్రాత్‌వైట్ 180 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అద్భుత సెంచరీ (147) సాధించిన షాయ్ హోప్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.