మ్యాచ్ చూడ్డానికి వచ్చిన అభిమానులకు, మ్యాచ్ కంటే ముందే మంచి కిక్ ఇచ్చారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. కొడుకుతో కలిసి ఆయన చేసిన సందడి స్టేడియంలో అభిమానులను హోరెత్తించేలా చేసింది. ముద్దులొలుకుతున్న షారుక్ చిన్న కొడుకు అబ్ రామ్ స్టేడియంలోకి ఎంటర్ అవగానే అందరి చూపు ఆ చిన్నారిపైనే నిలిచింది. తండ్రి షారుక్ తో కలిసి ఆ చిన్నారి చేసిన సరదా అల్లరి ఇప్పుడు నెట్ లోను హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో కింగ్స్ ఎలెవన్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు షారుక్ కూడా హాజరయ్యారు. చిన్న కొడుకు అబ్ రామ్ ను కూడా వెంట తీసుకొచ్చిన షారుక్ కొడుకుతో కలిసి స్టేడియంలో ఓ ఫన్నీ గేమ్ ఆడారు. అదేంటంటే.. కొడుకు అబ్ రామ్ కు షారుక్ ఒక నీళ్ల బాటిల్ ఇవ్వడం, అందులో కొన్ని నీళ్లు తాగి, కొన్ని నీళ్లను నోటిలోనే ఉంచుకుని తండ్రి దగ్గరకు వచ్చి ఆ నీళ్లను బుడుక్కుమని అబ్ రామ్ బయటకు ఉమ్మేయడం. షారుక్ కూడా కొడుకు చేసినట్టే చిన్న పిల్లాడిలా చేయడం.. మళ్లీ, మళ్లీ అదే రిపీట్ చేయడంతో అటు అబ్ రామ్ తో పాటు చూస్తోన్న అభిమానులను హుషారెత్తించింది ఈ తండ్రి కొడుకుల ఫన్నీ గేమ్.

ఇదంతా చూస్తున్న ప్రేక్షకులంతా అరుపులు, విజిల్స్ తో హంగామా చేశారు. మ్యాచ్ తర్వాత దీనికి సంబంధించిన వీడియో మొత్తాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు షారుక్. అంతేకాదు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అబ్ రామ్' అంటూ షారుక్ చేసిన ట్వీట్స్ వీడియో పట్ల అభిమానుల్లో మరింత ఆసక్లిని రేకిత్తించాయి. కాగా.. మ్యాచ్ లో షారుక్ జట్టు కోల్ కతా, పంజాబ్ పై విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.