హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య గత కొన్నేళ్లుగా దైపాక్షిక సిరిస్‌లు జరగని సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలే ఇందుకు ఉదాహరణ.
గతంలో అఫ్రిదికి కోహ్లీ తనతో పాటు పలువురు భారత ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని కానుకగా అందించిన సంగతి తెలిసిందే. జెర్సీని అందుకున్న అఫ్రిది సైతం టీమిండియాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడు తాజాగా కోహ్లీ చేసిన మరో సాయానికి గాను అఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత షాహిద్ అఫ్రిది 'ఎస్‌ఏ ఫౌండేషన్'ని నెలకొల్పాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సమాజంలో కొన్ని మంచి పనులు అఫ్రిది చేస్తున్నాడు. తాజాగా ఈ ఫౌండేషన్‌కి విరాట్ కోహ్లీ తను సంతకం చేసిన బ్యాట్‌ను విరాళంగా ఇచ్చాడు.
దీంతో ఆఫ్రీది కోహ్లీకి థ్యాంక్యూ కోహ్లీ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కానుకగా ఇచ్చిన జెర్సీని అఫ్రిది వేలంలో ఉంచగా కోహ్లీ జెర్సీ 4,300 యూరోలకు(సుమారు రూ.3,25,740) అమ్ముడుపోయింది.
ఫౌండేషన్ కోసం తనకు కానుకగా ఇచ్చిన పలువురి జెర్సీలను సైతం అఫ్రిది వేలంలో ఉంచాడు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని తన ఫౌండేషన్ ద్వారా చిన్నారుల విద్య కోసం వినియోగించనున్నట్లు అఫ్రిది తెలిపాడు. 2016లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ.. అఫ్రిదికి తన జెర్సీని కానుకగా అందజేశాడు.