కరాచీ: ప్రపంచకప్ టీ20లో పాకిస్థాన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని జట్టు చీఫ్ కోచ్ వకార్ యూనిస్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా తనను తప్పుకోవాల్సిందిగా ఆదేశించలేదనీ, ఒకవేళ తాను స్వచ్చందంగా వైదొలగితే అందరి దృష్టిలో విలన్‌గా మారే అవకాశముందని వకార్ తెలిపాడు.
'కోచ్ పదవి కావాలని నేనెప్పుడూ అభ్యర్థించలేదు. పీసీబీకి అప్లై చేసిన తర్వాతే నేను ఈ పదవికి ఎంపికయ్యాను. ఒకవేళ బోర్డు నన్ను తొలగించాలనుకుంటే ముందు లిఖితపూర్వకంగా తెలియజేయాలి' అని చెప్పాడు.
అంతేగాక, 'ఇప్పటికైతే నన్నెవరూ సంప్రదించలేదు. బోర్డుకు ఎలాంటి సమస్య లేనప్పుడు నేనెందుకు తప్పుకోవాలి. ఒకవేళ నేను వైదొలగితే ఇప్పుడు అందరి దృష్టిలో విలన్‌గా మారతాను' అని వకార్ అన్నాడు.

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అఫ్రిదీ
వరుస పరాజయాలు.. జట్టు సభ్యులతో విభేదాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు.. మొదలగు కారణాలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఇక కొనసాగలేనంటూ షాహిద్ అఫ్రిదీ గుడ్‌బై చెప్పా డు. టీ20 ప్రపంచకప్పులో పాకిస్థాన్ జట్టు పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఇప్పటినుంచి జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని తెలిపాడు.
'పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా నేను రాజీనామా చేస్తున్నాను. పాకిస్థాన్ జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతాను. ఇంతకాలం నన్ను ఆదరించిన నా అభిమానులకు కృతజ్ఞతలు' అని ట్విట్టర్ ద్వారా తన రాజీనామాను షాహిద్ ఆఫ్రిది ప్రకటించాడు.
ప్రపంచకప్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటానని చెప్పినా ఇంకా కొంతకాలం జాతీయజట్టుకు ఆడుతానని అఫ్రిదీ స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్టులతోపాటు వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిదీ టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు.