టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఐసీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఐసీసీ ద్వంద్వ నీతిని అనుసరిస్తోందని మండిపడ్డారు. సభ్య దేశాల పట్ల ఐసీసీ సమాన వైఖరిని ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో భారత్ ప్రస్తావన తెస్తూ షాహిద్ అఫ్రిది చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
ఐసీసీపై షాహిద్ అఫ్రిది ఘాటు విమర్శలు
షాహిద్ అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ చేసిన డిమాండ్లను గుర్తు చేస్తూ ఐసీసీని నిలదీశారు.

షాహిద్ అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ చేసిన డిమాండ్లను గుర్తు చేస్తూ ఐసీసీని నిలదీశారు. "2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వచ్చేందుకు భారత్ భద్రతా కారణాల దృష్ట్యా నిరాకరించింది. అప్పుడు ఐసీసీ వెంటనే స్పందించి భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చింది. ఒక దేశం కోరినట్లుగా వేదికలను మార్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు ఆ సానుకూలత చూపలేదు?" అని అఫ్రిది ప్రశ్నించారు. అంతర్జాతీయ క్రికెట్ పాలక మండలి అన్ని దేశాలను ఒకేలా చూడాలని, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు, అక్కడి కోట్లాది మంది అభిమానులకు గౌరవం దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ తప్పుకున్న తర్వాత తలెత్తిన భద్రతా కారణాలను చూపుతూ, తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిరాకరించింది. అయితే, ఐసీసీ దీనిపై దర్యాప్తు చేసి భారత్‌లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని తేల్చి చెప్పింది. షెడ్యూల్ మార్చేందుకు ఐసీసీ నిరాకరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది.
వరల్డ్ కప్‌లోకి స్కాట్లాండ్ ఎంట్రీ
బంగ్లాదేశ్ తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేరుస్తున్నట్లు ఐసీసీ శనివారం ధ్రువీకరించింది. టోర్నీ ప్రారంభానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. "ఐసీసీ వారధులను నిర్మించాలి కానీ, ఉన్న సంబంధాలను తగులబెట్టకూడదు. పారదర్శకత, నిష్పక్షపాతమే క్రీడకు పునాది," అని అఫ్రిది హితవు పలికారు.