హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ... తనలో ఇంకా క్రికెట్ చావ తగ్గలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిరూపించాడు. నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో చాలా రోజుల తర్వాత మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ టోర్నీలో హాంప్‌షైర్ తరఫున ఆడుతున్న అఫ్రిది డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక్కడి విశేషం ఏమిటంటే ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 256 టీ20లాడిన అఫ్రిదికి ఇదే తొలి సెంచరీ.

అఫ్రిది ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అఫ్రిది 234 యావరేజితో చెలరేగాడు. సెంచరీ చేసిన తదుపరి బంతికే అఫ్రిది పెవిలియన్‌కు చేరడం విశేషం. మరోవైపు అఫ్రిదికి తోడు హాంప్‌షైర్ జట్టు కెప్టెన్ జేమ్స్ వియన్స్ కూడా 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో అంతకముందు అఫ్రిది అత్యధిక వ్యక్తిగత స్కోరు 18. అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్‌తో హాంప్‌షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 249 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ జట్టు 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో 101 పరుగుల తేడాతో గెలిచిన అఫ్రిది జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది.