లాహోర్: పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ షాహిద్ ఆఫ్రిదికి ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ గట్టి షాకిచ్చింది. ఇప్పటికే జట్టులో స్ధానం కోల్పోయిన అఫ్రిదిని తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 2016-17 సంవత్సరానికి గాను అక్టోబర్ 1 నుంచి జులై 30 వరకు కాంట్రాక్టు జాబితాలో అఫ్రిది పేరును తొలగించింది. ఆసియా కప్, వరల్డ్ టీ20 టోర్నమెంట్లలో పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షాహిది అఫ్రిదిని ఏప్రిల్ 3వ తేదీన కెప్టెన్సీ నుంచి బోర్డు తప్పించింది.

ఆ తర్వాత అతడు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. గత కొన్నేళ్లుగా అఫ్రిది కేటగిరీ-ఏలో చోటు దక్కించుకున్నాడు. అయితే తాజా కాంట్రాక్ట్ జాబితాలో అతడికి ఏ కేటగిరిలోనూ చోటు కల్పించలేదు. అదే విధంగా సయీద్ అజ్మల్‌ని కూడా పాకిస్థాన్ బోర్డు తప్పించింది.
ఇటీవలే ఆఫ్రిదికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని తొలుత పీసీబీ భావించింది. అంతలోనే అతడు అతడి వీడ్కోలు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లుగా పాకిస్థాన్ బోర్డు పేర్కొంది. బోర్డు తాజా షాక్‌తో అఫ్రిది క్రికెట్ భవిష్యత్ దాదాపు ముగిసిపోయినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన లెగ్ స్పిన్నర్ యాషిర్ షాతో పాటు హఫీజ్, షోయబ్ మాలిక్‌లకు కేటగిరీ-ఏ చోటు దక్కించుకున్నారు. మరోవైపు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లను పీసీబీ కేటగిరి-సీలోకి చేర్చింది. టాప్ కేటగిరిలో ఉండే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, అలవెన్సు, బోనస్‌లు కాకుండానే నెలకు రూ.5 లక్షలు అదనంగా అందుతాయి.