
హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని షాహిద్ అఫ్రీది కోల్పోయాడు. మే31న వెస్టిండీస్ తో తలపడనున్న మ్యాచ్‌కు మోకాలి గాయం కారణంతో బాధపడుతోన్న అఫ్రీది అందుబాటులో ఉండట్లేదని సమాచారం. ఐసీసీ చారిటీ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లో అడుగుపెడతాడని భావించిన అభిమానులు నిరుత్సాహమే మిగిలింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉండకపోవడానికి కారణం అతనిని వైద్యులు ఇంకా 4వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించడమే.
ఈ విషయంపై స్పందించిన అఫ్రీది గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా స్పందించారు. గాయం నుంచి కోలుకునేందుకు చికిత్స నిమిత్తం దుబాయ్‌లోని డాక్టర్‌ను సంప్రదించాను. ఇంకా మోకాలు పూర్తిగా కోలుకోలేదని.. దానికి 3 నుంచి నాలుగు వారాల పాటు సమయం పడుతుందని సూచించారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మ్యాచ్‌లో ఆడాలని ఆశపడుతున్నా. నా గురించి మీరు కూడా ప్రార్థించండి' అని అందులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే నేపాల్‌కు చెందిన యువ స్పిన్నర్ సందీప్ లమిచానే మాత్రం అరుదైన అవకాశాన్ని కొట్టేశాడు. ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టులో అతనికి చోటు దక్కింది. 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట నిర్వహించనున్న ఈ మ్యాచ్‌లో ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్‌తో వెస్టిండీస్ జట్టు తలపడబోతోంది.
వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్‌సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్‌లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరణ పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐసీసీ వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
వరల్డ్ ఎలెవన్ తుది జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, హర్దీక్ పాండ్యా, లూక్ రోంచి, మెక్లినగన్, సందీప్ లమిచానే
వెస్టిండిస్:
కార్లోస్ బ్రాత్‌వైట్, రయాద్ ఎమ్రిత్, ఆండ్రూ ఫ్లెచర్, క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, అశ్లే నర్స్, కీమోపాల్, రోవ్‌మాన్ పొవెల్, దినేష్ రామ్‌డిన్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, సామ్యుల్ బద్రీ, మార్లాన్ సామ్యుల్స్, కెస్రిక్ విలియమ్స్