ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టీ20 లీగ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ ఆరాఫత్ సన్నీ సంచలనం నమోదు చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం రంగపూర్ రైడర్స్, ఖల్నా టిటియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఆరాఫత్ సన్నీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. రంగపూర్ రైడర్స్ చేతిలో టిటియన్స్ జట్టు 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రైడర్స్ ఆటగాళ్లు పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది, ఆరాఫత్ సన్నీ బౌలింగ్ దెబ్బకు టిటియన్స్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఖల్నా టిటియన్స్ జట్టు 12 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఖల్నా టిటియన్స్ బ్యాట్స్‌మెన్ షువగత కొంత సేపు నిలకడగా రాణించి 12 పరుగులు చేశాడు. ఈ 12 పరుగులే జట్టు స్కోరులో అత్యధికం కావడం విశేషం.

టిటియన్స్ జట్టు 10.4 ఓవర్లకే ఆలౌటై 44 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) చరిత్రలోనే అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. అంతక ముందు 58 పరుగులతో ఈ రికార్డు బరిసల్ బుల్స్ జట్టు పేరిట ఉంది. టిటియన్స్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్లు డకౌటయ్యారు.
మరో ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రంగపూర్ రైడర్స్ బౌలర్ షాహిది ఆఫ్రిది 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 45 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రంగపూర్ రైడర్స్ ఒక వికెట్ నష్టపోయి 8 ఓవర్లలో టార్గెట్‌ని చేధించింది. షాహిది ఆఫ్రిదికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.