పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ మైదానంలో ఎంత హోరాహోరీగా సాగుతుందో.. వివాదాలు కూడా అంతే స్థాయిలో కలకలం రేపుతున్నాయి. తాజాగా లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్, పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఓ భారీ వివాదంలో చిక్కుకున్నాడు. టీమ్ హోటల్లో కఠినమైన భద్రతా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అఫ్రిది సొంత ఫ్రాంచైజీ లాహోర్ ఖలందర్స్ అతడిపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇది పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో ఓ కెప్టెన్‌పై ఫ్రాంచైజీ తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా భావిస్తున్నారు.
అసలెందుకు ఈ జరిమానా?
ఈ వివాదానికి ప్రధాన కేంద్రం హోటల్ గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశం. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికిందర్ రజా తన గదిలోకి నలుగురు అతిథులను ఆహ్వానించడానికి అనుమతి కోరారు. అయితే క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు(పీసీబీ), భద్రతా అధికారులు ఈ అభ్యర్థనను స్పష్టంగా తిరస్కరించారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా షాహీన్ అఫ్రిది, సికిందర్ రజా రాత్రి 11 గంటల సమయంలో ఆ నలుగురు అతిథులను రహస్యంగా గదిలోకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు అర్ధరాత్రి 1.25 గంటల వరకు అక్కడే గడిపినట్లు హోటల్ సీసీటీవీ, భద్రతా సిబ్బంది గుర్తించారు.

లాహోర్ డీఐజీ అసహనం
ఈ ఘటనపై లాహోర్ డీఐజీ మహ్మద్ ఫైసల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భద్రతా ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించడం అంటే కేవలం నిబంధనలను అతిక్రమించడం మాత్రమే కాదని.. అది ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అని ఆయన పాకిస్థాన్ సూపర్ లీగ్ సీఈఓకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఎంత వారించినా వినకుండా, స్టార్ హోదాను అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్లడం క్రమశిక్షణారాహిత్యం కిందికి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, తమ జట్టులో క్రమశిక్షణే ముఖ్యమని చాటిచెప్పడానికి వెంటనే జరిమానా నిర్ణయాన్ని ప్రకటించింది.
వివరణ ఇచ్చిన పీసీబీ
అయితే ఈ జరిమానా ప్రకటనలో ఓ ఆసక్తికరమైన మలుపు ఉంది. ఈ వివాదంలో షాహీన్ అఫ్రిదితో పాటు సికిందర్ రజా పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. ఫ్రాంచైజీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కేవలం షాహీన్ పేరు మాత్రమే ప్రస్తావించబడింది. సికిందర్ రజాపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫ్రాంచైజీ ఈ ఘటనను ఒక పొరపాటు లేదా అవగాహన లోపంగా పేర్కొంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. భద్రతా నియమాలను ఉల్లంఘించే ఉద్దేశం తమ ఆటగాళ్లకు లేదని.. కానీ నిబంధనల పట్ల స్పష్టత లేకపోవడం వల్ల ఇది జరిగిందని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది.
ఈ పరిణామం ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణ జరుగుతున్న ఈ తరుణంలో భద్రతా నియమాలను స్టార్ ఆటగాళ్లే తుంగలో తొక్కడం వల్ల దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాహీన్ షా అఫ్రిది లాంటి బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరింత లోతుగా విచారణ జరిపి ఇంకేవైనా కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.