Shaheen Afridi: బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్థాన్ జట్టుకు చుక్కెదురైంది. 11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయి పాకిస్థాన్ పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవస చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సిరీస్ ఓడిపోయినప్పటికీ తన జట్టు ప్రదర్శనపై తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది ఏమన్నారంటే?
మ్యాచ్ ముగిసిన అనంతరం షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. "ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం వల్ల మ్యాచ్‌లో వెనుకబడ్డాం. అయితే నా జట్టుపై నాకు గర్వంగా ఉంది. చివరి బంతి వరకు పోరాడారు. యువ ఆటగాళ్ల నుంచి మాకు కావాల్సింది ఇదే. చాలా మంది యువ ఆటగాళ్లు మొదటిసారి ఇక్కడ వన్డేలు ఆడుతున్నారు.వారు ఆడిన తీరు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. వారికి మేము పూర్తి మద్దతు ఇస్తాం" అని షాహీన్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ పరాజయం తర్వాత ఎదుర్కొన్న మరో పెద్ద ఓటమి ఇది. సాధారణంగా ఇలాంటి సిరీస్ ఓటముల తర్వాత కెప్టెన్ల నుంచి కఠినమైన కామెంట్స్ వస్తుంటాయి. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం సానుకూల దృక్పథంతో మాట్లాడటం అభిమానులకు వింతగా అనిపిస్తోంది. ఓడిపోయినా గర్వంగా ఉందని మాట్లాడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మ్యాచ్ సాగిందిలా..
బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, ఆరంభంలో బాగానే ఆడినా చివరికి ఒత్తిడికి లోనైంది. 50 ఓవర్లు ముగిసేసరికి 279 పరుగులకే ఆలౌట్ అయ్యి 11 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో పాక్ క్రికెట్ వర్గాల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి.