పాకిస్థాన్ క్రికెట్ జట్టులో దారుణమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్- స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది ఘోరంగా కొట్టుకున్నారని సమాచారం. వారిద్దరిని ఆపడానికి ప్రయత్నించిన మహ్మద్ రిజ్వాన్ కూడా దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం ఈ సంఘటన చోటు చేసుకుంది.
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌పై బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లా తొలిసారి గెలుపు రుచి చూసింది. అంతేగాక స్వదేశంలో టెస్టు ఫార్మాట్‌లో ప్రత్యర్థి చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడం పాకిస్థాన్‌కు ఇదే ప్రథమం.

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. అయితే ఓటమి అనంతరం పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అఫ్రిది-షాన్ మసూద్ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటన జరగడానికి ముందు వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలో తన భుజంపై షాన్ మసూద్ చేయి వేయగా దాన్ని అఫ్రిది కోపంతో తీసేశాడు.కాగా, రెండో టెస్టుకు షాహిన్ అఫ్రిదిని తుదిజట్టు నుంచి తప్పించారు. జట్టు కూర్పు కోసం అఫ్రిదిని తప్పిస్తున్నామని కోచ్ గిలెస్పీ పేర్కొన్నప్పటికీ అఫ్రిది దురుసు ప్రవర్తనే కారణమని తెలుస్తోంది.