
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం సాధించింది. కోల్‌కతా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్.. మూడో మ్యాచ్‌లో కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు దారుణంగా విఫలమైంది. టామ్ కరన్ (54, 36 బంతుల్లో; 2×4, 3×6) హాఫ్ సెంచరీతో పోరాడినా రాయల్స్‌ను గెలిపించలేకపోయాడు. కోల్‌కతా రెండో విజయంను ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా తరపున శుభ్‌మన్ గిల్ (47) రాణించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా కోల్‌కతా విజయంపై స్పందించాడు. 'యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన షాట్లు బాదాడు. ఆండ్రీ రసెల్ ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు ఇయాన్ మోర్గాన్ బాగా కష్టపడ్డాడు. బౌలింగ్ కూడా బాగుంది. బౌలింగ్‌లో మార్పులు చేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు సైతం ఎంతో సమతూకంగా కనిపిస్తోంది' అని సచిన్ ట్వీట్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌పై కోల్‌కతా సహ యజమాని, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ స్పందించాడు. సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజమే తన జట్టు ప్రదర్శన గురించి గొప్పగా చెప్పినప్పుడు ఇంకా తాను చెబితే అర్థముండదన్నాడు. జట్టులోని యువకులంతా అద్భుతంగా రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. లవ్ యు బాయ్స్ అని సచిన్ చేసిన ట్వీట్‌ను ఖాన్ రీట్వీట్ చేశాడు. మ్యాచ్ ఆద్యంతం షారుఖ్ స్టాండ్స్ నుంచి ఆటగాళ్లను ప్రోత్సహించాడు.
రాజస్థాన్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అచ్చం ఇలాంటి సంఘటనే గతంలో సచిన్‌కు కూడా ఎదురైంది. దీనిపై సచిన్ స్పందిస్తూ రెండు వీడియోలను పంచుకున్నాడు. 'నిన్నటి మ్యాచ్‌లో సంజు పట్టిన క్యాచ్ అద్బుతం. అయితే ఆ క్యాచ్ పట్టె సమయంలో అలా వెనక్కి పడటం వల్ల తలకు అయిన గాయం నొప్పిని తట్టుకోలేము. ఎందుకంటే అచ్చం అలాంటే సంఘటనే నేను కూడా గతంతో ఎదుర్కొన్నాను. 1992 ప్రపంచకప్‌లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను కూడా అలానే గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి వెనక్కి పడ్డాను. దీంతో నా తలకు స్వల్ప గాయమైంది' అంటూ గుర్తు చేసుకున్నాడు.