
హైదరాబాద్: టెడ్ అనే కంపెనీ స్టార్ నెట్ వర్క్ సహకారంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం పేరు 'టెడ్ టాక్స్ ఇండియా నయా సోచీ'. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హోస్ట్‌గా ఈ కార్యక్రమం డిసెంబర్ 10న ప్రారంభమైంది.
జనవరి 1న ఈ కార్యక్రమానికి భారత మహిళల జట్టు కోచ్ మిథాలీ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్... మిథాలీ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మిథాలీ రాజ్ తనదైన శైలిలో స్పందించింది.
షారుక్ అడిగిన ఓ ప్రశ్నకు గాను 'మైదానంలో తాము ఆడున్నంతసేపు.. మన జట్టు ట్రోఫీతో తిరిగి వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకే క్రీజులో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి అంతా. మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికే చూస్తాం' అని మిథాలీ సమాధానమిచ్చింది.
అనంతరం 'మిథాలీ రాజ్‌ని టీమిండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా చూడాలనుకుంటున్నాం' అని షారుక్ ఖాన్ అడగ్గా 'నేను ఎప్పుడూ నా బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటాను' అని బదులిచ్చింది. ఇక, గతేడాది లండన్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్‌లో మిథాలీ ఓ పుస్తకం చదువుతూ మనకు ఎన్నోసార్లు కనిపించింది.
దీనిపై మిథాలీ రాజ్ మాట్లాడుతూ 'ఒత్తిడిని అధిగమించడానికే పుస్తకాలు చదువుతా. పుస్తకాలు మనల్ని ప్రోత్సహించడంలోనూ ఎంతో సాయం చేస్తాయి' అని సమాధానమిచ్చింది. మిథాలీరాజ్‌ను షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ చేసిన ఈ ఎపిసోడ్ జనవరి 7న ప్రసారం కానుంది.