ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కోఓనర్ నెస్ వాడియాతో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రిటైన్డ్ లిస్ట్ ఆటగాళ్ల పరిమితిని పెంచకూడదని పంజాబ్ కింగ్స్ పేర్కొనడంతో షారుక్ ఖాన్ మండిపడినట్లు సమాచారం.
ఈ సమావేశంలో కొన్ని ఫ్రాంచైజీలు ఓ కూటమిగా, మరికొన్ని ఫ్రాంచైజీలు మరో కూటమిగా ఏర్పడ్డాయి. కేకేఆర్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు మెగా వేలానికి వ్యతిరేకించాయి. 2025 సీజన్‌కు ముందు మినీ వేలాన్ని నిర్వహించాలని పేర్కొన్నాయి. అంతేగాక రిటైన్డ్ లిస్ట్, రైట్ టూ మ్యాచ్ కార్డ్‌ను ఎక్కువ సంఖ్యలో ఉండాలని డిమాండ్ చేశాయి.

నాలుగు నుంచి అయిదేళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని చెప్పాయి. మూడేళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహించడం వల్ల ఆటగాళ్లపై పెట్టుబడి ఉపయోగంగా మారలేకపోతుందని వాదించారు. మరోవైపు పంజాబ్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలం నిర్వహించాల్సిందే అని పట్టుబట్టాయి. రిటైన్డ్ లిస్ట్, ఆర్‌టీఎమ్ సంఖ్యను పెంచడానికి ఈ ఫ్రాంచైజీలు ఒప్పుకోలేదు.
సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడాడు. ''ప్రతి విషయంపై మేం చర్చించాం. వారం రోజుల్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం'' అని జై షా పేర్కొన్నాడు. కాగా, షారుక్ ఖాన్‌తో జరిగిన గొడవ గురించి నెస్ వాడియా స్పందించాడు. ''షారుక్ ఖాన్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అతనితో శత్రుత్వం లేదు. ప్రతి ఒక్కరి తమ అభిప్రాయాలు ఉంటాయి. అయితే అంతిమంగా అందరికి మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి'' అని నెస్ వాడియా అన్నాడు.