
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూన్ నెలకు గాను 'ప్లేయర్స్ ఆఫ్ ద మంత్' నామినీలను ప్రకటించింది. వుమెన్స్ క్రికెట్‌లో భారత యువ సంచలనం షెఫాలీ వర్మతో పాటు ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. వీరితో పాటు ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకిల్స్టోన్నూ జూన్ నెలకుగానూ నామినేట్ చేసింది ఐసీసీ. మెన్స్ క్రికెట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డేవన్ కాన్వే, పేసర్ కైల్ జేమీసన్తో పాటు దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ కెప్టెన్ క్వింటాన్ డికాక్‌ను ఐసీసీ నామినేట్ చేసింది.
టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న షెఫాలీ వర్మ.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో, వన్డేల్లో చోటు సంపాదించి అరంగేట్ర సిరీస్‌లోనే ఆకట్టుకుంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా షెఫాలీ ఎంపికైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా.. మొత్తంగా నాలుగో మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇక వన్డేల్లోనూ ఫర్వాలేదనిపించింది. దీంతో మూడు ఫార్మాట్‌లలో తన ఖాయం చేసుకుంది.
ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు డ్రా కావడంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లీష్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. ఇక బంతితోనూ మెరిసిన స్నేహ్.. నాలుగు వికెట్లతో రాణించింది. భారత్‌తో టెస్టులో 8 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టోన్ కూడా పోటీలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కివీస్ క్రికెటర్ కాన్వే.. తర్వాత జరిగిన రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కైల్ జేమీసన్ డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో 7 వికెట్లతో మెరిశాడు. ఇక విండీస్‌తో టెస్టు సిరీస్‌లో డికాక్ 141, 96 పరుగులు చేశాడు.
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.