
టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం శభాష్ మిథు. తాజాగా 56 సెకన్ల ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్రంలో మిథాలీ రాజ్ పాత్ర హిరోయిన్ తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. జనాలతో కిక్కిరిసిన స్టేడియంలోకి బ్యాటింగ్‌కు వస్తున్న మిథాలీ రాజ్ పాత్రతో టీజర్ ఆరంభమైంది. వన్డే క్రికెట్‌లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా, అతి పిన్న వయసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా, 4 వన్డే ప్రపంచకప్‌లకు కెప్టెన్సీ, 23 ఏళ్ల క్రికెట్ కెరీర్ వంటి మిథాలీ సాధించిన రికార్డులను ఈ టీజర్‌లో చూపించారు. అయితే టీజర్‌లో రిలీజ్ డేట్ గురించి చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శభాష్ మిథు చిత్రాన్ని గతంలో ఫిబ్రవరి 4న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాలతో అది సాధ్యపడలేదు. వయాకామ్ 18 స్టూడియో నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించాడు. ప్రియ అవెన్ కథను అందించాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీజిత్ ముఖర్జీ గతంలో 'ఆటోగ్రాఫ్', 'బైసే స్రాబన్', 'బేగం జాన్' వంటి 20కి పైగా సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన తాప్సీ గతంలో క్రీడానేపథ్యం ఉన్న సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి మూవీస్‌లో నటించింది. అలాగే ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. మిథాలీలా ఆడటం, ప్రవర్తించడం గురించి మెళకువలు నేర్చుకుంది. కాగా మరో టీమిండియా సీనియర్ క్రీడాకారిని జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా కూడా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హిరోయిన్ అనుష్కశర్మ ప్రధాన పాత్రలో నటించనుంది.
కెరీర్లో 12 టెస్టు మ్యాచ్‌లాడిన మిథాల్ రాజ్ 43 సగటుతో 699 పరుగులు చేసింది. 230 వన్డే మ్యాచ్‌ల్లో 50 సగటుతో 7737 పరుగులు చేసింది. 89 టీ20 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 2364 పరుగులు చేసింది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకపే మిథాలీ రాజ్ కెరీర్లో చివరిది. ఈ టోర్నీ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీరాజ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.