కోహ్లీ కేప్టెన్సీ పతనానికి ఆ మ్యాచ్ ఓటమితోనే బీజం: ఎసరు పెట్టిన ఆ ఇద్దరు సీనియర్లు ఎవరు?

అబుధాబి: టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ కేరీర్‌లో 2021 క్రికెట్ క్యాలెండర్ ఇయర్ అత్యంత కీలకంగా మారింది. అతని కేరీర్‌లో కొన్ని కీలక మలుపులు ఈ ఏడాది సంభవించనున్నాయి. జాతీయ జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతోన్నట్లు విరాట్ కోహ్లీ ఇదివరకే ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ తరువాత అతను జట్టులో ఓ సాధారణ ప్లేయర్‌గా మాత్రమే కనిపిస్తాడు. అతని తరువాత రోహిత్ శర్మ కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడం దాదాపు ఖాయమైంది. రోహిత్ పట్టాభిషేకం ఇక లాంఛనప్రాయమే.

ఆర్సీబీ కేప్టెన్‌గానూ
ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోక ముందే మరో సంచలన ప్రకటన చేశాడు కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా కూడా తనకు ఇదే చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని ప్రకటించాడు. ఈ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ ముగిసిన తరువాత రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కేప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పబోతోన్నాని చెప్పాడు. ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఓ ఆటగాడిగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు అబుధాబి షేక్ జయేద్ స్టేడియం నుంచి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు విరాట్ కోహ్లీ.

ఈ నిర్ణయాలకు ఆ ఓటమే కారణం..
విరాట్ కోహ్లీ ఇలా వెంటవెంటనే సంచలన నిర్ణయాలను తీసుకోవడానికి ప్రధాన కారణం- ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలు కావడమేనని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో నార్తాంప్టస్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్‌లో 217, రెండో ఇన్నింగ్‌లో 170 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని అందుకున్నారు బ్లాక్ క్యాప్స్.

కోహ్లీ కేప్టెన్సీ మీద డ్రెస్సింగ్ రూమ్‌లో హీట్..
ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కిందని, కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు దారుణంగా తిప్పి కొట్టాయంటూ కొందరు సీనియర్ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జయ్ షా దృష్టికి తీసుకెళ్లారని, మ్యాచ్‌లో ఓడిపోవడానికి గల కారణాలను వారు పాయింట్ టు పాయింట్ వివరించినట్లు వార్తలొస్తున్నాయి. చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె బీసీసీఐ కార్యదర్శిని కలిసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మిగిలిన క్రికెటర్లతోనూ..
ఆ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల నుంచి కంప్లయిట్లను అందుకున్న తరువాత.. జయ్ షా- ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడాడని చెబుతున్నారు. వారు కూడా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఓ రిపోర్ట్‌ను తయారు చేయించాడని తెలుస్తోంది. ఆ తరువాతే- వన్డే, టీ20 ఫార్మట్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ కేప్టెన్ హోదా నుంచి తప్పుకొంటాడనే వార్తలు వచ్చాయి.. ఈ వార్తలను తొలుత బీసీసీఐ తోసిపుచ్చింది. విరాట్ కోహ్లీని తప్పించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.

స్వచ్ఛందగా..
విరాట్ కోహ్లీ కేప్టెన్సీపై బీసీసీఐ నుంచి ఓ క్లారిటీతో ఆ వివాదానికి తెర పడినట్టే భావించారు అంతా. బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన కొద్దిరోజులకే విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తాను కేప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. అతని అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే మీడియాలో కథనాలు రావడం వల్ల బీసీసీఐ స్పందించిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే కోహ్లీ.. కేప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications