రాత్రికి రాత్రి మారిపోయిన ప్రత్యర్థి: బ్లాక్ క్యాప్స్‌తో కోహ్లీసేన ఢీ!

లండన్: ప‌్రపంచకప్ టోర్నమెంట్‌లో రాత్రికి రాత్రి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రత్యర్థులు మారిపోయారు. పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు చెదిరిపోయాయి. ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన ఆసీస్ టీమ్ రెండో స్థానానికి దిగజారింది. రెండో స్థానంలో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి.

అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి
దక్షిణాఫ్రికా జట్టుపై నమోదు చేసిన ఒక్క పరాజయం.. ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసింది. అదే సమయంలో- శ్రీలంకపై భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసిన ఫలితం వల్ల కోహ్లీసేన అగ్రస్థానానికి చేరుకుంది. ఓ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.

బ్లాక్ క్యాప్స్‌తో టీమిండియా సిగపట్లు!
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన టీమిండియా తన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన జరుగనుంది. మరో సెమీస్‌లో- రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో ఉన్న టైటిల్ హాట్ ఫేవరెట్- ఇంగ్లండ్ జట్టును ఢీ కొట్టబోతోంది. మొన్నటిదాకా కూడా ఇంగ్లండ్ జట్టు టీమిండియాను ఢీ కొట్టే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టు భావిస్తూ వచ్చారు క్రికెట్ పండితులు. వరుస పరాజయాలతో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.. బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం దాదాపు అసాధ్యమని లెక్కలు కడుతూ వచ్చారు. అదే సమయంలో- టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన శ్రీలంకను ఓడించడం పెద్ద పనేమీ కాదని, ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు తారుమారు అయ్యే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చని అనుకుంటూ వచ్చారు.

సమీకరణాలను మార్చేసిన ఒకే ఒక్క మ్యాచ్
దక్షిణాఫ్రికా జట్టు కంగారూలను ఖంగు తినిపించడంతోనే అసలు చిక్కంతా వచ్చి పడింది. రాత్రికి రాత్రి సమీకరణాలు మారిపోయాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాలు కిందా, మీదా అయ్యాయి. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ ఓటమితో రెండో స్థానానికి పడిపోగా.. శ్రీలంకపై విజయం సాధించిన టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. అగ్రస్థానంలో ఉన్న జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న జట్టును ఢీ కొట్టాల్సి ఉన్నందున- టీమిండియా ఇక నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications