
హైదరాబాద్: జాతీయ సెలక్టర్లకు పారదర్శకత అవసరమని సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అభిప్రాయపడ్డాడు. గత రంజీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఇండియా-ఏ, దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై నిరాశచెందాడు. గత రంజీ సీజన్‌లో షెల్డన్ జాక్సన్ 854 పరుగులు చేసినప్పటికీ ఇండియా-ఏ జట్టుకు ఎంపికవ్వలేదు.
దీంతో పాటు దులిప్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో సైతం అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో తన ట్విట్టర్‌లో "ఈ ఏడాది సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడింది. అన్ని వేదికల్లో ఆ జట్టులోని అద్భుత ప్రదర్శన చేశారు. అయినా ఆశ్చర్యకరంగా జట్టు నుంచి ఒక్కరూ ఏ సిరీస్‌లకు ఎంపికవ్వలేదు. దీనిని బట్టి రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రదర్శనకు ప్రాముఖ్యత లేదా?" అని జాక్సన్ అన్నాడు.
"లేక చిన్న సంఘాలను పట్టించుకోరా? శీతాంషు కోటక్ కోచింగ్‌లో ఐదు ఏళ్లలో సౌరాష్ట్ర మూడు రంజీ ఫైనళ్లు ఆడింది(ఈ మధ్య కాలంలో మా జట్టులో రాణించిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ చాలామంది ఉన్నారు. కానీ ఎవరికీ పేరు రాలేదు)" అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.
"చాలామంది ప్రశ్నించొద్దని నాకు చెప్పారు. అయితే ఓ మంచి సంస్థకు మేమంతా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆటగాళ్లుగా ఎక్కడ వెనకబడ్డామో, ఎందుకు వెనకబడ్డామో తెలుసుకొనే అర్హత మాకుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. లేదంటే ఎందుకు ఎంపిక చేయడం లేదనే సందేహంతోనే మా కెరీర్లు ముగుస్తాయి. సెలక్టర్లకు పారదర్శకత అవసరం" అని జాక్సన్ ట్విట్టర్‌లో తన ఆవేదనను వెళ్లగక్కాడు.
గత రంజీ సీజన్‌లో షెల్డన్ జాక్సన్ రెండు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేశాడు. షెల్డన్ ట్వీట్‌కు బెంగాల్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ ట్విట్టర్‌లో "నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ ఆవేదనకు న్యాయం ఉంది. దేవుడి ఆశ్వీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి" అని బదులివ్వడం విశేషం.