
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ బుధవారం తెలిపాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ధావన్‌ను ఇంగ్లాండ్‌లోనే ఉంచి బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ధావన్ గాయం తీవ్రతపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ "శిఖర్ ధావన్ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి 10-12 రోజుల సమయం పట్టొచ్చు. మేము అతనికి సహాయం చేస్తాం. అవసరమైతే అతని స్థానంలో తుదిజట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేస్తాం. ఇంకో ఆటగాడిని అందుబాటులో ఉంచుకోవడం ఎప్పటికైనా మంచిదే. కావున, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలోనే మాంచెస్టర్‌లో అడుగుపెట్టనున్నాడు" అని అన్నాడు.
నిజానికి ధావన్ స్థానంలో బీసీసీఐ అధికారికంగా ఎవరినీ ఎంపిక చేయకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగా రిషబ్ పంత్‌ను జట్టు మేనేజ్‌మెంట్ ఇంగ్లాండ్‌కు పిలిపించింది. ఐసీసీ నిబంధన ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకున్నప్పటికీ అతడిని జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు.
టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, జూన్ 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు కాబట్టి ఈ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 27న వెస్టిండీస్‌తో, 30న ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన తలపడనుంది.
ఈ మూడు వారాల్లో ధావన్ గనుక కోలుకోని పక్షంలో రిషబ్ పంత్‌ను అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశముంది. మరోవైపు శిఖర్ ధావన్ జూన్ 30 కల్లా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి సెలక్టర్లకు కబురు అందినట్లు వార్తలు వస్తున్నాయి.