IND vs ENG: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటింటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ మొత్తం ఆడేందుకు తనకు అవకాశం ఇవ్వమని సెలక్టర్లు చెప్పడం వల్లే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని మాంటీ పనేసర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు విరాట్ కోహ్లీ వస్తాడని తాను అనుకున్నానని.. ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా కోహ్లీ ఆడతాడని ఆశించారని పనేసర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కానీ విరాట్ కోహ్లీ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ వంటి కఠిన సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ కావాలనే బయటపడ్డాడని అనిపిస్తోందని ఆయన పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా వైడ్ ఆఫ్ స్టంప్ సమస్యను విరాట్ కోహ్లీ అధిగమించలేకపోతున్నాడని.. టెస్ట్ క్రికెట్‌లో పదేపదే అదే బంతులకు విరాట్ కోహ్లీ ఔట్ అవుతున్నాడని చెప్పాడు.

బహుశా ఇది విరాట్ కోహ్లీ మనస్సులో ఉండవచ్చన్నారు. అదే విధంగా సెలెక్టర్లు కూడా విరాట్ కోహ్లీతో ఓ విషయం చర్చించి ఉంటారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ బాగా రాణించకపోతే.. మిగిలిన 3 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుందని సెలెక్టర్లు చెప్పి ఉండొచ్చని.. ఇవన్నీ ఆలోచించాకే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడని మాంటీ పనేసర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ సేన ఇంగ్లండ్ వంటి జట్టుపై టీమిండియా ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.