న్యూఢిల్లీ: చెప్పా పెట్టకుండా సిరీస్ మధ్యలో తనను తొలగించారని, అది తనను చాలా బాధించిందని టీమిండియా మాజీ సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.2013లో భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీసే సెహ్వాగ్‌కు చివరిది. ఆ సిరీస్‌లో విఫలప్రదర్శనతో సిరీస్ మధ్యలో సెహ్వాగ్ జట్టులో చోటు కోల్పోయాడు.
జట్టుకు దూరం కావడంపై అతను అప్పట్లో మాట్లాడకున్నా, అలా సిరీస్ మధ్యలో చెప్పాపెట్టకుండా తనను తొలగించినందుకు ఎంత బాధ పడ్డదీ ఇప్పుడు చెప్పాడు. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో పరుగులు చేయలేకపోయానని చెప్పాడు.

అయితే మరో రెండు టెస్టుల్లో తనకు అవకాశం లభిస్తుందని అనుకున్నానని, అప్పుడూ విఫలమైతే జట్టులో చోటు కోల్పోతానేమోనని భావించానని, కానీ మరో అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. తనను తొలగించినట్టు కనీసం చెప్పనైనా చెప్పలేదని అన్నాడు ఆ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నానని సెహ్వాగ్ చెప్పాడు.
ఆ సంఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పాడు. కనీసం ఆ రెండు టెస్టులు ఆడి, రిటైర్ అవ్వాలని సూచించినా, ఆ దిశగా ఆలోచించేవాడినని అన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి గానీ సెలెక్టర్లు లేదా బిసిసిఐ నుంచి గానీ తనకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని చెప్పాడు.