
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సచిన్‌కు క్రికెటర్లు, అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అభిమానులు కూడా సచిన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్ ద్వారా శుభాకాంక్షల వెల్లువను కురిపిస్తున్నారు. ఇకపోతే సచిన్‌కు లెజెండరీ బ్యాటర్, భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సర్‌ప్రైజ్ విషెస్ చెప్పాడు. అసలింతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటీ అనుకుంటున్నారా.. సచిన్ బర్త్‌డే రోజు తాను సైలెంట్‌గా ఉంటా.. ఏమాత్రం అరవను అంటూ ట్విట్టరులో వీడియో పోస్ట్ చేసి మరీ సెహ్వాగ్ చెప్పాడు. అసలు సెహ్వాగ్ ఎందుకలా చేశాడంటే దానికో పెద్ద కథ ఉంది.
టీమిండియా క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలో నెంబర్ 1గా పేర్కొనే జోడీ సచిన్, సెహ్వాగ్. వీరిద్దరి జోడీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోకి వీళ్లు ఎంటర్ అవుతుంటే అభిమానుల కేకలకు గ్రౌండ్ మొత్తం దద్దరిల్లేది. సచిన్ ముందు కాస్త నిదానంగా ఆడేవాడు. కానీ సెహ్వాగ్ మాత్రం బౌండరీలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఇద్దరి మధ్య స్ట్రైక్ రొటేషన్ కూడా బాగుండేది. మంచి సమన్వయంతో ఆడేవారు. మంచి స్నేహితులు కూడా. సచిన్ బర్త్‌డే సందర్భంగా తామిద్దరు కలిసి క్రికెట్ ఆడే రోజులను సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో ఇద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను ట్విట్టరులో వీడియో ద్వారా పంచుకున్నాడు.
'డ్రెస్సింగ్ రూం నుంచి మ్యాచ్ చూసేటప్పుడు సచిన్ నన్ను సైలెంట్‌గా ఉండాలనేవాడు. గ్రౌండ్లో మన బ్యాటర్లు స్కోర్ చేసినా చెయ్యకపోయినా సైలెంట్‌గానే ఉండాలి సరేనా అంటూ చెప్పేవాడు. అయినా నేను వింటేగా.. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. ఇక ఇలా కుదరదని సచిన్ డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లాడు. కొన్ని అరటిపండ్లు పట్టుకొచ్చాడు. నేను ఎక్కువ మాట్లాడకూడదని ఆ అరటిపండ్లు తినిపించేవాడు. తన ప్లాన్ అప్పుడు వర్కౌట్ అయింది. అందుకే ఈరోజు సచిన్ పుట్టినరోజు సందర్భంగా నేను సచిన్‌కు ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా. అదేంటంటే నా సైలెన్స్. ఈరోజు నేను ఒక్క మాట కూడా మాట్లాడను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్ డే పాజీ.. ఈరోజు మీరు చెప్పినట్లే మాట్లాడకుండా అరటిపండ్లను లాగించేస్తా'' అంటూ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా సచిన్ బర్త్‌డే రోజే ముంబై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ పై మరింత ఫోకస్ ఉంటుంది. అలాగే వరుసగా 7మ్యాచుల్లో ఓడిన ముంబై.. కనీసం ఈ రోజు సచిన్ కోసమైన గెలవాలంటూ.. అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరీ ముంబై గెలుపుతో సచిన్‌కు గిఫ్ట్ ఇస్తుందో లేదో.