న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా జెర్సీ ధరించి దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. తన ఆట తీరుతో మనదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. తాను భారత్ తరపున ఆడిన చివరి సమయంలో పరుగులు చేయకపోవడానికి గల కారణాలను తెలిపాడు. అంతేగాక, తాను మళ్లీ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం సెహ్వాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. తన కంటి సమస్య కారణాంగానే గతంలో పరుగులు రాబట్టడంలో విఫలమైనట్లు సెహ్వాగ్ తెలిపాడు.
తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ ప్రపంచ ఉత్తమ బౌలర్ల బౌలింగ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచుల్లో కూడా సెహ్వగ్ ఓపెనర్‌గానే వచ్చాడు. కన్ను, చేయి సహకారంతో సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000వేల పరుగులు చేశాడు. 36ఏళ్ల సెహ్వాగ్ చివరి సారిగా 2013లో భారత్ తరపున ఆడాడు.

ఇప్పటికే 104 టెస్టులు, 251 అంతర్జాతీయ వన్డేల మ్యాచులు ఆడిన సెహ్వాగ్ మళ్లీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నాడు.
2011లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల నాటి నుంచి కంటి సమస్యతో బాధపడుతున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు.
'2011లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల సందర్భంలోనే నాకు కంటి సమస్య తీవ్రమైంది. కంటి చూపు(ఐ సైట్) కారణంగా నాకు తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పి ఉండేది. నేను చాలామంది వైద్యులను సంప్రదించాను. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలోనే ప్రతీ టెస్ట్ మ్యాచ్ తర్వాత నేను కంటి నిపుణుల వద్దకు వెళ్లాను. అయితే వారు నా కళ్లు బాగానే ఉన్నాయని చెప్పారు' అని తెలిపాడు.
'వైద్యులు ఏం చెప్పారంటే.. మైగ్రేన్ వల్లే నీకు తలనొప్పి వస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇండియాకు వచ్చిన నేను, మా ఫ్యామిలీ డాక్టర్ హర్షకుమార్‌ను సంప్రదించాను. నాకు కంటిచూపు సమస్య లేదని, నాకు 0.5మైనస్ పవర్ ఉందన్నారు. నాకు దూరపు చూపు సమస్య ఉందని తెలిపారు. ఆ తర్వాత నాకు కంటి అద్దాలు ఇచ్చారు. వాటిన అడ్జెస్ట్ చేసుకునేందుకు దాదాపు సంవత్సరం పట్టింది. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నాను. ఎవరైనా టీమిండియాకు ఆడాలని కోరుకుంటారు. నేను టీమిండియాకు మళ్లీ ఆడాలని కోరుకుంటున్నా. టీమిండియా ఆటగాడిగా విరమణ చేయాలనుంది. నా శక్తి మేరకు ప్రయత్నిస్తా' అని సెహ్వాగ్ తెలిపాడు.
లెన్సెస్ తనకు సూట్ కాకపోవడంతోనే కళ్లద్దాలు వాడుతున్నట్లు తెలిపాడు. 'నేను చాలా లెన్స్‌లు ఉపయోగించేందుకు ప్రయత్నించా. అయితే అవి నాకు సూట్ కాలేదు. వాటి వల్ల నేను ఇబ్బంది పడేవాన్ని. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సమయంలో లెన్స్ వాడాను. వాటి ఉపయోగం అంతగా లేకపోవడంతో కళ్ల అద్దాలను పెట్టుకోవడం మొదలుపెట్టా. ప్రస్తుతం కళ్ల అద్దాలు ధరించి నేను బాగా ఆడగలుగుతున్నాను. ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.