హైదరాబాద్: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అప్పీల్స్ ప్యానెల్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కింది. 'నాడా'కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా సెహ్వాగ్ ఎంపికయ్యాడు.
సెహ్వాగ్‌తో పాటు ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్ వినయ్ లాంబా ఎంపికకు క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. క్రికెట్‌ను కూడా 'నాడా' పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్- ఏడీడీపీ)ని కూడా 'నాడా' నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. ఈ కమిటీలో మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజురాణి దేవి ఎంపిక చర్చనీయాంశమైంది.
డోపింగ్ ఉల్లంఘనకు గాను 2001లో ఆమె ఆరు నెలల నిషేధం ఎదుర్కొంది. క్రీడాకారులు డోపింగ్‌కు పాల్పడ్డారో లేదో తేల్చే ప్యానెల్‌లో ఆమెకు సభ్యురాలిగా నియమించడం విశేషం. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.