హైదరాబాద్: హెలికాప్టర్ షాట్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ షాట్‌ని పరిచయం చేసింది ధోనియే. హెలికాప్టర్‌లాగే బ్యాట్‌ను గుండ్రంగా తిప్పుతూ బంతిని స్టాండ్స్‌లోకి పంపడం చూసి మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు.
అప్పట్లో అసలు ఇదేం వింత షాట్ అని కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఎంతో మంది ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇప్పటికీ ఆ షాట్ ఆడటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ మధ్య కాలంలో ధోని కూడా ఈ షాట్ ఆడటం లేదు. అయితే శనివారం ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 తర్వాత కామెంటేటర్లు ధోని హెలికాప్టర్ షాట్ చాలెంజ్ తీసుకున్నారు.

ఇందులో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డీన్ జోన్స్, బ్రెట్ లీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. నలుగురూ అచ్చం ధోని లాగే హెలికాప్టర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. అయితే వీరితో సెహ్వాగ్ ఒక్కడే కాస్త ఫరవాలేదనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.