హైదరాబాద్: టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యపై మరోసారి చమత్కారపు ట్వీట్‌ని పోస్టు చేశాడు. సెహ్వాగ్ మంగళవారం సతీ సమేతంగా సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు.
సినిమా చూసేందుకు వెళ్లినప్పటికీ, సెహ్వాగ్ మనసంతా ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై, పూణె జట్ల మధ్య జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌పైనే ఉంది. దీంతో సెహ్వాగ్ ఓ అద్భుతమైన ప్లాన్ వేశాడు. తన భార్యతో పాటు సినిమాకు వెళ్లిన సెహ్వాగ్, భార్య సినిమా చూస్తుంటే తాను మాత్రం మొబైల్‌లో మ్యాచ్ చూశాడు.
దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అంతేకాదు ఈ ఫోటో కింద సెహ్వాగ్ పెట్టిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'భార్య సంతోషంగా ఉందంటే జీవితం ఆనందంగా ఉన్నట్టు. థియేటర్‌లో భార్య సినిమా చూస్తుండగా మ్యాచ్ చూస్తున్నా. నేను ఖుషీ, ఆమె ఖుషీ. చిన్న ఆనందం' అని ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం పూణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది.